YSRCP: యోగా డే ముందు రచ్చకు వైసీపీ బిగ్ ప్లాన్
ABN , Publish Date - Jun 18 , 2025 | 08:59 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం ముందు రాష్ట్రంలో గలాటా సృష్టించేందుకు వైసీపీ తన వంతు ప్రయత్నాలు చేస్తుందా? అందుకు గుంటూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను ఆ పార్టీ ఎంచుకుందనే సమచారం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
గుంటూరు, జూన్ 18: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో రచ్చ చేసేందుకు ఆ పార్టీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసిందంటూ ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంకు ఒక రోజు ముందు రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగేలా ఏదో ఒక గొడవ సృష్టించేందుకు వైసీపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది.
నేడు (బుధవారం) గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనను రాష్ట్రవ్యాప్తంగా చర్చ చేసేందుకు వైసీపీ కుట్ర వ్యూహాలను చేస్తుందంటూ టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులోభాగంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా కార్యకర్తల సమీకరణకు ఆ పార్టీ ఏర్పాట్లు చేసిందంటూ టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ క్రమంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలను సమీకరించాలని ఇప్పటికే పార్టీ ఇన్‌చార్జ్‌లకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
అలాగే జిల్లా నేతలతో పార్టీ అగ్రనేతలు స్వయంగా మాట్లాడి కార్యకర్తలను తీసుకువచ్చే బాధ్యతలను వారికి అప్పగించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా పోలీసుల సూచనలు, నిబంధనలు ధిక్కరించడం ద్వారా గలాటా సృష్టించేందుకు పక్కా ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఇక ఇతర ప్రాంతాల వారిని పోలీసులు ఆపితే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకే ఈ ప్రణాళిక అని నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి నివేదిక అందింది.
అయితే పరామర్శకు పరిమిత సంఖ్యలో వచ్చి వెళితే అభ్యంతరం లేదని ఇప్పటికే వైసీపీ నేతలకు జిల్లా ఎస్పీ తెలిపారు. ముందస్తు సమాచారంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దాంతో ఆంక్షలు విధించారు. అదీకాక పొదిలి పర్యటనలో వైసీపీ శ్రేణులు దాడుల నేపథ్యంలో పోలీసు శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది.
2024 ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చాడు. వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏదో ఒక సమస్యను సృష్టించేందుకు ఆ పార్టీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అందుకు గతంలో జరిగిన సంఘటనలే ఉదాహరణ అని వారు స్పష్టం చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకోన్నాయి.
అలాగే పొగాకు రైతులకు మద్దతు తెలుపుతూ ఇటీవల ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్బంగా రాళ్ల దాడి ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు మరో గలాటా సృష్టించేందుకు వైసీపీ పక్కా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. దీంతో వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లిలో భారీగా పోలీసులను రంగంలోకి దింపింది.
ఇవి కూడా చదవండి:
చిన్నారి ప్రాణం తీసిన బీడీ ముక్క..
11 రోజుల్లో.. 6 దేశాలు తిరిగాం
For More AP News and Telugu News