Assembly Attendance : పీఛేముడ్!
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:12 AM
హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని ఇన్నాళ్లూ భీష్మించిన వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఎట్టకేలకు మెట్టు దిగారు.

రేపు అసెంబ్లీకి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు
విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానని ఇన్నాళ్లూ భీష్మించిన మాజీ సీఎం
సభ్యత్వం పోయే పరిస్థితి రావడంతో వెనక్కి!
గవర్నర్ ప్రసంగానికి వెళ్లేందుకు నిర్ణయం
60 రోజులపాటు సభకు రాకపోతే సభ్యత్వం పోతుందని స్పీకర్ స్పష్టీకరణ
దీంతో మెట్టు దిగిన వైసీపీ అధినేత
తొలి రోజు మాత్రమే సభకు వస్తారా?
లేక చివరి వరకూ కొనసాగుతారా?
బెంగళూరు నుంచి నేడు తాడేపల్లికి రాక
అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని ఇన్నాళ్లూ భీష్మించిన వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఎట్టకేలకు మెట్టు దిగారు. సోమవారం నుంచి మొదలవుతున్న 2025-26 వార్షిక బడ్జెట్ సమావేశాలకు తన ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరు కానున్నారు. తొలిరోజు సభలో జరిగే గవర్నర్ ప్రసంగానికి వీరంతా హాజరవ్వనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి 11 సీట్లు లభించిన విషయం తెలిసిందే. దానివల్ల ప్రతిపక్ష హోదాను జగన్ కోల్పోయారు. అయినా, విపక్ష హోదా కోసం ఇన్నాళ్లుగా ఆయన వాదిస్తూనే ఉన్నారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచీ జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లడంలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో తాను వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వంపై సంధించే ప్రశ్నలకు .. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలని ఇటీవల జగన్ హూంకరించారు. ఈ క్రమంలో అసెంబ్లీ నిబంధనల ప్రకారం వరుసగా అరవై రోజులు ఏ కారణం లేకుండా, సమాచారం ఇవ్వకుండా నిరవధికంగా సభకు గైర్హాజరు అయితే సభ్యుల సభ్యత్వం రద్దవుతుందని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అధికారికంగానే స్పష్టం చేశారు. శాసనసభకు హాజరుకాకపోతే .. సభ్యత్వం రద్దయితే .. ఉప ఎన్నికలను ఎదుర్కోనాల్సి వస్తుందని జగన్ భావించారోఏమోగానీ... అనూహ్యంగా వెనక్కి తగ్గారు.
శాసనసభా సమావేశాలకు హాజరవుదామంటూ శనివారం జగన్‌కు శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ సూచించినట్టు తెలిసింది. ఇందుకు జగన్ తలూపారు. అయితే..శాసనసభా సమావేశాలకు ఎంతకాలం జగన్, ఆయన ఎమ్మెల్యేలు హాజరవుతారనేది మాత్రం స్పష్టత లేదు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం తర్వాత వేరే కార్యకలాపాలు లేకుండానే సభ ఆ రోజుకు వాయిదా పడుతుంది. తిరిగి మంగళవారం సమావేశమవుతుంది. మరి... జగన్, ఎమ్మెల్యేలు తొలి రోజు మాత్రమే వస్తారా? లేక బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది. కాగా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు తీరును శాసనసభలో నిలదీస్తామంటూ సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. కాగా.. ఆదివారం బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్ చేరుకుంటారు. ఆ వెంటనే, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో ఆయన సమావేశమవుతారు. ఈ సమావేశంలో అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యేదీ ఆయన స్పష్టతను ఇస్తారని వైసీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు.