Share News

MLC Pundula Ravindra Babu: అమరావతి.. దెయ్యాల నగరం!

ABN , Publish Date - Mar 06 , 2025 | 04:55 AM

వ్యాంధ్ర రాజధాని అమరావతిపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

 MLC Pundula Ravindra Babu: అమరావతి.. దెయ్యాల నగరం!

  • మండలిలో వైసీపీ సభ్యుడు పండుల రవీంద్ర వ్యాఖ్యలు

  • దీటుగా బదులిచ్చిన మంత్రులు

అమరావతి, మార్చి 5(అమరావతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పండుల చేసిన వ్యాఖ్యలపై మండలిలో ఉన్న మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. రాజధానిపై మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదని మండిపడ్డారు. గత ఐదేళ్లు ఇదే విషం చిమ్మారని, మళ్లీ మొదలుపెట్టారని మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, మండలి చీఫ్‌విప్‌ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పండుల మాట్లాడుతూ.. ‘‘అమరావతిని కట్టలేరు. ఇది దెయ్యాల నగరం(ఘోస్ట్‌ సిటీ). అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని అంటున్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి నగరాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. అమరావతిని పదేళ్లలో కట్టేస్తామంటే కట్టలేరు. కొత్తగా నగరాలు నిర్మించడం సాధ్యంకాదని మయన్మార్‌(బర్మా) నిరూపించింది. ఆ దేశంలో కొత్తగా రాజధాని కట్టారు. అక్కడ భవనాలే తప్ప మనుషులు లేరు. అందుకే ఆ రాజధానిని ఘోస్ట్‌ సిటీ అంటారు. అమరావతి కూడా అంతే.’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అధికార పక్షం కూడా దీటుగా బదులిచ్చింది.

మూడు రాజధానులు అన్నవారికి..

అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కట్టి తీరుతామని మంత్రి కొల్లు ఉద్ఘాటించారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న వారికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో.. ఒకే రాజధాని అన్న మాటపై నిలబడిన వారికి ఇచ్చిన తీర్పు ఏంటో గమనించాలని హితవు పలికారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతంలో మనుషులేలేరా? మనుషుల మధ్యలో నుంచి కాదా మీరు వచ్చేది?’’ అని నిలదీశారు. మూడు రాజధానుల నిర్ణయం తప్పని వైసీపీ నేతలు గ్రహించారన్నారు. ‘‘మా(వైసీపీ) నిర్ణయం తప్పు. ప్రజలు అంగీకరించలేదని బొత్స చెప్పారు. అమరావతిపై పునరాలోచిస్తామన్నారు. ఆ వీడియోను సభలో ప్రదర్శించమంటే ప్రదర్శిస్తాం.’’ అని అన్నారు.


తీరు మార్చుకోండి: కొలుసు

మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. వైసీపీ నేతలు గత ఐదేళ్లలో అమరావతిపై విషం చిమ్మారని ఇప్పటికైనా వారు తమ తీరు మార్చుకోవాలని హితవుపలికారు. అమరావతిలో మనుషులు కాకుండా ఎవరుంటారని ప్రశ్నించారు. కాగా, అమరావతిపై తాము తీసుకున్న నిర్ణయం తప్పని తాను ఎక్కడా చెప్పలేదని వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘ఆరోజు మా విధానం అది. ఆ విధానం ప్రకారం ముందకు వెళ్లాం. ఈ రోజు మా విధానం ఏంటనేది పార్టీలో చర్చించి చెబుతామని చెప్పా. రాజధానిపై ఏం జరగబోతోందన్నది కాలమే చెబుతుంది.’’ అని తెలిపారు.

Updated Date - Mar 06 , 2025 | 04:55 AM