Share News

YCP : టార్గెట్లు పెట్టి మరీ తప్పులు!

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:20 AM

కూలీలకు పనులు లేకుండానే మస్టర్లు వేయాలంటూ హుకుం జారీచేసి కోట్ల పనిదినాలు పూర్తి చేయించినట్లు లెక్కలు రాసుకున్నారు.

YCP : టార్గెట్లు పెట్టి మరీ తప్పులు!

  • ఉపాధి సిబ్బందిని ఫణంగా పెట్టిన వైసీపీ సర్కారు.. కూలీలకు పని లేకుండానే మస్టర్లు వేయాలని హుకుం

  • కోట్ల పనిదినాలు పూర్తి చేయించినట్లు దొంగ లెక్కలు

  • ఇలాంటి తప్పులతో ఉపాధి పథకం లక్ష్యం దెబ్బతింది

  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్రం లేఖ

  • ఇప్పుడు తనిఖీల్లో వెలుగు చూస్తున్న ఆనాటి తప్పులు

  • వందల సంఖ్యలో సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ సర్కారు హయాంలో ఉపాధి హామీ పథకంలో సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ తప్పులు చేయించారు. కూలీలకు పనులు లేకుండానే మస్టర్లు వేయాలంటూ హుకుం జారీచేసి కోట్ల పనిదినాలు పూర్తి చేయించినట్లు లెక్కలు రాసుకున్నారు. ఆ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సోషల్‌ ఆడిట్‌, క్వాలిటీ కంట్రోల్‌, విజిలెన్స్‌ విభాగం, అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇలాంటి తప్పులతో రాష్ట్రంలో పథకం లక్ష్యం దెబ్బతిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో 2023-24లో చేపట్టిన పనులపై కూటమి ప్రభుత్వం సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ను మార్చి పకడ్బందీగా తనిఖీలు చేపడుతుండటంతో అప్పట్లో చేసిన తప్పులు భారీగా వెలుగు చూస్తున్నాయి. నాటి ప్రభుత్వమే టార్గెట్లు పెట్టి వేధించడంతో పనులు లేకుండానే మస్టర్లు వేసిన ఫలితంగా ఉపాధి సిబ్బంది ఇప్పుడు బలవుతున్నారు. ఇప్పటివరకూ సుమారు 400కు పైగా మండలాల్లో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. వందల సంఖ్యలో సిబ్బందిని ఇంటి దారి పట్టించారు. అప్పటి ప్రభుత్వం చేయించిన తప్పులకు తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని వారంతా వాపోతున్నారు.


మెటీరియల్‌ నిధుల కోసం తప్పులు

ఉపాధి హామీ పథకంలో సాధారణంగా ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు ఎక్కువగానే మస్టర్లు నమోదవుతాయి. ఆ తర్వాత ఒక్కో ప్రాంతంలో వ్యవసాయ పనులు ముమ్మరమైతే ఈ పనులకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులతో సంబంధం లేకుండానే మస్టర్లు వేసేశారు. గ్రామాల్లో పనులు కూలీల ద్వారా చేయిస్తే దానికి అనుగుణంగా మెటీరియల్‌ పనులు చేసేందుకు కేంద్రం నిధులిస్తుంది. వాటికోసం రాష్ట్ర స్థాయి అధికారులు టార్గెట్లు పెట్టి సిబ్బందితో మస్టర్లు కొట్టేయించడంతో క్షేత్రస్థాయిలో అవినీతి తారస్థాయికి చేరింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంది. అయితే వైసీపీ సర్కారు మాత్రం దొడ్డిదారిని ఎంచుకుంది.


సిబ్బందిపై ఒత్తిడి

ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఏపీవోలు, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లపై క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో అప్పట్లో తప్పులు యధేచ్ఛగా జరిగిపోయాయి. ఏపీడీలపై రాష్ట్రస్థాయి అధికారులు ఒత్తిడి తేవడం.. వారు సిబ్బందిపై స్వారీ చేయడంతో పనులు లేకున్నా గ్రామా ల్లో యథేచ్ఛగా మస్టర్లు నమోదయ్యాయని చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఉపాధి పనులకు వచ్చేవారు లేరని, అంద రూ పట్టణాలకు వలస వెళ్లారని ఫీల్డ్‌ అసిస్టెంట్లు చెప్పినా... డ్వామా అధికారులు అంగీకరించలేదు. వారి ఇళ్లకు వెళ్లి జాబ్‌కార్డులు తీసుకుని మస్టర్లు నమోదు చేయమని ఆదేశించారని సమాచారం. అలాగే ఒక్కో కూలీకి వేతనం రూ.270కి తగ్గకుం డా రికార్డు చేయాలని ఒత్తిడి తెచ్చారని, దీంతో పనులు చేసినా, చేయకపోయినా, పనులకు అసలే హాజరు కాకపోయినా కూలీలు పనికి వచ్చినట్లు అటెండెన్స్‌ వేసి నమోదు చేయాల్సి వచ్చిందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చిన మస్టర్లు తప్పనిసరిగా నమోదు చేయాల్సి వచ్చిందని, లేకుంటే సాయంత్రానికి ఏపీడీ నుంచో, పీడీ నుంచో వేధింపులతో ఫోన్లు వచ్చేవని గుర్తుచేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడితో ఉద్యోగాలు నిలబెట్టుకునేందుకు తప్పుడు మస్టర్లు వేయడం, నిఘా విభాగాల నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడటం ఉపాధి సిబ్బందికి అలవాటుగా మారింది. ఇప్పుడు కూలీలతో నిజంగా పనులు చేయించాలంటే సిబ్బందికి కష్టమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తప్పుదారి పట్టిన ఉపాధి సిబ్బందితో సక్రమంగా పనులు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Updated Date - Feb 15 , 2025 | 04:20 AM