AP Govt: ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటండి
ABN , Publish Date - Jun 06 , 2025 | 02:55 AM
చెట్లు పెంచడం బాధ్యత.. వాటిని నరకడం దుర్మార్గం. దురదృష్టం కొద్దీ గత ఐదేళ్లూ చెట్లు నరకడం తప్ప నాటడం తెలియని ప్రభుత్వం ఉంది. అప్పటి సీఎం పైన హెలికాప్టర్లో వెళ్తుంటే కింద చెట్లు నరికేసేవారు. అలా చేస్తే కొన్ని దేశాల్లో జైలుకు పంపుతారు.
చెట్లు నరకడం దుర్మార్గం
గత ప్రభుత్వం ఐదేళ్లూ అదే పనిచేసింది: ముఖ్యమంత్రి
నాటి సీఎం హెలికాప్టర్లో వెళ్తున్నా కింద ఉన్న చెట్లు నరికేవారు
కొన్ని దేశాల్లో హత్యానేరంతో సమానం
వాటిని పెంచని వారు స్వచ్ఛమైన గాలిని ఆశించడం సమంజసమా?
ఇక రాష్ట్రంలో గ్రీన్, సర్క్యులర్ ఎకానమీ
2029 నాటికి 37% పచ్చదనం లక్ష్యం
సీడ్ రాఖీతో ఆడబిడ్డలు పర్యావరణానికి దోహదపడాలి
పర్యావరణ దినోత్సవాన బాబు పిలుపు
చెట్లే మనిషికి ఆధారం.. ఆనవాళ్లు: పవన్
అమరావతిలోని అనంతవరంలో మొక్కలు నాటిన సీఎం, డిప్యూటీ సీఎం
వచ్చే అక్టోబరు 2 నాటికి 17 కార్పొరేషన్లు, వచ్చే ఏడాది జూన్ 5 నాటికి మొత్తం రాష్ర్టాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం. 175 నియోజకవర్గాల్లోనూ నగర వనాలు ఏర్పాటు చేస్తాం.
-సీఎం చంద్రబాబు
ఈ ఏడాది కోటి మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుంటా. వచ్చే వన మహోత్సవంలో ఆ అనుభవాలు పంచుకుంటా.
-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గుంటూరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ‘చెట్లు పెంచడం బాధ్యత.. వాటిని నరకడం దుర్మార్గం. దురదృష్టం కొద్దీ గత ఐదేళ్లూ చెట్లు నరకడం తప్ప నాటడం తెలియని ప్రభుత్వం ఉంది. అప్పటి సీఎం పైన హెలికాప్టర్లో వెళ్తుంటే కింద చెట్లు నరికేసేవారు. అలా చేస్తే కొన్ని దేశాల్లో జైలుకు పంపుతారు. మనిషిని చంపినట్లుగానే ఆ దేశాల్లో భావిస్తారు. అంత కఠినంగా శిక్షిస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చెట్లను పెంచడం తెలియనివారు స్వచ్ఛమైన గాలిని ఆశించవచ్చా అని ప్రశ్నించారు. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం పది మొక్కలు నాటాలని.. వాటిని పెంచి సంరక్షించాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలోని తుళ్లూరు మండలం అనంతవరంలో గురువారం వన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏడీసీఎల్ పార్కులో ముఖ్యమంత్రి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి మొక్కలు నాటారు. సభా వేదిక వద్ద పర్యావరణ పరిరక్షణ నిమిత్తం కాలుష్య మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. 21న ప్రధాని ఆధ్వర్యంలో విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని, అక్కడ ఒకే రోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నీస్ రికార్డ్ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. 25 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా...
వ్యర్థాలను పునరుత్పాదక వనరులుగా వినియోగించుకుంటూ రాష్ట్రాన్ని కాలుష్యరహితంగా మార్చే గ్రీన్ అండ్ సర్క్యులర్ ఎకానమీని అమలు చేస్తాం. వచ్చే నాలుగేళ్లలో 37 శాతం, 2047 నాటికి 50 శాతం పచ్చదనాన్ని సాధించి.. ప్రపంచానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తాం. గుంటూరు, విశాఖలో చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో వేస్ట్ కంపోస్టు కేంద్రాలు నెలకొల్పాం. రీసైక్లింగ్ కింద ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో 157 రెడ్యూస్, రీ-యూజ్, రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. కుళ్లిన చికెన్ పునర్వినియోగించి హై ప్రొటీన్ ఉత్పత్తుల తయారీకి ఉపయోగించవచ్చు. అలా ప్రతి వ్యర్థాన్ని తిరిగి వినియోగంలోకి తెచ్చి కాలుష్యరహిత సమాజాన్ని పొందడమే సర్క్యులర్ ఎకానమీ. రాష్ట్రంలో 37,421 చ.కిలోమీటర్ల పరిధిలో అడవులున్నాయి. రాష్ట్ర విస్తీర్ణంలో ఇది 23 శాతం. అటవీయేతర ప్రాంతంలోని పచ్చదనంతో కలిపి 30.05 శాతం పచ్చదనం ఉంది. దానిని 2047 నాటికి 50 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక్క రోజే కోటి చెట్లను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందాన్నిస్తోంది. వచ్చే పర్యావరణ దినోత్సవం నాటికి 5.58 కోట్ల మొక్కలు పెంచాలని సంకల్పించాం. 50 శాతం పచ్చదనం సాధించడంలో ఆడబిడ్డల పాత్ర కీలకం. అన్నదమ్ముల నక్షత్రాలకు చెందిన మొక్కల విత్తనాలతో తయారు చేసిన సీడ్ రాఖీలను వారంతా కట్టాలి. వాటిని నాటేలా ప్రోత్సహించాలి. మియావాకీ తరహా గార్డెన్లు, అనేక దేశాల గార్డెన్లు అమరావతిలో పెంచుతాం. చైనీస్, కొరియా, జపాన్ గార్డెన్లను ఇక్కడ రూపొందిస్తాం.
ఇంటి అడ్ర్‌సకు నాడు చెట్లే ఆనవాళ్లు: పవన్ కల్యాణ్
తమ చిన్నతనంలో ఇంటి అడ్రస్ చెప్పే సమయంలో ఆ ఇంటికి దగ్గరలో ఉన్న చెట్లను ఆనవాళ్లుగా చెప్పేవాళ్లమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆ విధంగా చెట్లు మనిషికి ఆధారమే కాకుండా.. మనిషికి ఆనవాళ్లుగా కూడా నిలిచాయన్నారు. ఫారెస్ట్ మ్యాన్ అంకారావు కృషిని, సంకల్పాన్ని కొనియాడారు. ఆయన గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆసక్తిగా ఉందని చెప్పారు. ఆయనలా తాను కూడా కోటి మొక్కలు నాటాక సగర్వంగా మాట్లాడతానని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, కందుల దుర్గేశ్, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య, ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, పీసీసీఎఫ్ ఏకే నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అటవీశాఖ సలహాదారుగా అంకారావు
వనజీవి రామయ్య తన జీవితమంతా ఊరూరా తిరిగి మొక్కలు పెంపకంపై అవగాహన కల్పించారు. ఆయన అందరికీ స్పూర్తి. నా చిన్నతనంలో మా గ్రామంలో కేశవయ్యనాయుడు అనే సామాజిక కార్యకర్త కూడా అడవులు నరక్కుండా తీసుకున్న చర్యలు, నన్ను భాగస్వామిని చేసిన తీరు నాలో స్ఫూర్తి నింపాయి. నీరు-చెట్టు, వనం-మనం, ఇంకుడుగుంతలు వంటి కార్యక్రమాలు చేపట్టాను. నల్లమల సంరక్షణకు జీవితాన్ని అంకితం చేసి మూడు దశాబ్దాలుగా నల్లమలలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసి, కోట్లాది విత్తన బందలు వేసిన ‘ఫారెస్ట్ మ్యాన్’ కొమెర అంకారావు కృషి శ్లాఘనీయం. ఆయన్ను రాష్ట్ర అటవీశాఖ సలహాదారుగా నియమిస్తున్నాం.