Share News

Madvi Hidma: ఎవరీ మద్వి హిడ్మా.. మారేడుమిల్లి అడవిలో చనిపోయిన అగ్రనేత బ్యాగ్రౌండ్ ఇదే..

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:46 AM

మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత మద్వి హిడ్మా మృతి చెందారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, అనుచరులతో కలిపి మొత్తం ఆరుగురు ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఇంతకూ ఎవరీ మద్వి హిడ్మా.

Madvi Hidma: ఎవరీ మద్వి హిడ్మా.. మారేడుమిల్లి అడవిలో చనిపోయిన అగ్రనేత బ్యాగ్రౌండ్ ఇదే..
Maoist commander Hidma

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత మద్వి హిడ్మా మృతి చెందారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, అనుచరులతో కలిపి మొత్తం ఆరుగురు ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. హిడ్మా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పర్వతి గ్రామానికి చెందిన స్థానిక మూరియా తెగకు చెందిన వ్యక్తి (Maoist commander Hidma).


1981వ సంవత్సరంలో జన్మించిన హిడ్మా 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. 2000 ప్రారంభంలో మావోయిస్ట్ ఉద్యమంలో చేరి, క్రమంగా అగ్రస్థానానికి ఎదిగాడు. ప్రస్తుతం సీపీఐ (మావోయిస్ట్), పీఎల్‌జీఏ బెటాలియన్–1 కమాండర్‌గా దండకారణ్య ప్రాంతంలో (ఛత్తీస్‌గఢ్, బీజాపూర్, దంతేవాడ ప్రాంతాలు) పనిచేస్తున్నాడు. 2010లో జరిగిన దంతేవాడ దాడి (76 సీర్పీఎఫ్ సిబ్బంది హతం), 2013 జీరామ్ ఘాటి నరమేధం వంటి పలు పెద్ద దాడుల్లో ప్రధాన సూత్రధారి హిడ్మా అని ఆరోపణలు ఉన్నాయి (CPI Maoist leader encounter).


ఈ ఏడాది హిడ్మా సీపీఐ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC) సెక్రటరీగా పదోన్నతి పొందినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. హిడ్మాను పట్టుకోవడం కోసం పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి బహుమతులు కూడా ప్రకటించారు. అడవుల భౌగోళిక పరిజ్ఞానం, గెరిల్లా యుద్ధ వ్యూహాలు, స్థానిక నెట్‌వర్క్‌లను ఉపయోగించడంలో హిడ్మా సిద్ధహస్తుడు. దీంతో అతడిని భద్రతా దళాలు చాలా కాలం పట్టుకోలేకపోయాయి (Hidma background).


2004 నుంచి ఇప్పటివరకు అతను 20కి పైగా ప్రధాన దాడుల్లో పాల్గొన్నట్లు భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి (Hidma profile). వేలాది మంది సిబ్బందితో పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్లు కూడా హిడ్మాను పట్టుకోలేకపోయాయి. ఎట్టకేలకు మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో హిడ్మా, అతడి అనుచరులు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు చిక్కింది. భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో హిడ్మాతో సహా ఆరుగురు మరణించినట్టు పోలీసులు తెలిపారు.


ఇవీ చదవండి:

పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇదే పెద్ద ప్రమాదమంటున్న ఆనంద్ మహీంద్రా..

మీ బ్రెయిన్‌కు పరీక్ష.. ఈ మంచులో పెంగ్విన్‌ను 15 సెకెన్లలో కనిపెట్టండి..


Read Latest and Viral news

Updated Date - Nov 18 , 2025 | 11:46 AM