Turakapalem : పల్నాడు జిల్లా తురకపాలెంలో ఏం జరుగుతోంది? నేడు ఐసీఏఆర్ బృందం పర్యటన
ABN , Publish Date - Sep 08 , 2025 | 08:29 AM
పల్నాడు జిల్లా తురకపాలెంలో ICAR బృందం పర్యటించనుంది. అక్కడి మట్టి నమూనాలు సేకరించబోతోంది. ఇప్పటికే తురకపాలెంలో ఎయిమ్స్ బృందం వైద్యులు పర్యటించి గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించారు.
నేడు పల్నాడు జిల్లా తురకపాలెంలో ICAR బృందం పర్యటన
మట్టి నమూనాలు సేకరించనున్న ICAR బృందం
ఇప్పటికే తురకపాలెంలో పర్యటించిన ఎయిమ్స్ బృందం
గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించిన వైద్య సిబ్బంది
తురకపాలెం గ్రామానికి చెందిన ఆరుగురికి జీజీహెచ్‌లో చికిత్స
గుంటూరు, సెప్టెంబర్ 8 : పల్నాడు జిల్లా తురకపాలెంలో ఇవాళ(సోమవారం) ICAR బృందం పర్యటించనుంది. అక్కడి మట్టి నమూనాలు సేకరించబోతోంది. ఇప్పటికే తురకపాలెంలో ఎయిమ్స్ బృందం వైద్యులు పర్యటించి గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించారు. 'మెలియాయిడోసిస్' లక్షణాలున్న తురకపాలెం గ్రామానికి చెందిన ఆరుగురికి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఇవాళ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ICAR) బృందం పర్యటించి గ్రామంలోని వ్యవసాయ భూముల నుండి మట్టి నమూనాలను సేకరించి, నీటి సరఫరా, మట్టి ఫలదీకరణ స్థితిని విశ్లేషించనుంది. దీంతోపాటు, ICAR బృందం గ్రామస్తులతో సమావేశమై, వారి అనుభవాలు, సమస్యలపై చర్చించి, సాంకేతిక సలహాలు అందించనుంది.
మరోవైపు, ఎయిమ్స్ బృందం తీసుకున్న గ్రామస్తుల రక్తనమూనాల ఆధారంగా గ్రామంలో ఆరోగ్య సమస్యలను గుర్తించి, తగిన చికిత్స అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో వైద్య సిబ్బంది గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేస్తూ, మరికొందరి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. ఈ పరీక్షల్లో మట్టి, నీటి కలుషితం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక, గుంటూరు జీజీహెచ్‌లోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న తురకపాలేనికి చెందిన ఆరుగురిలో ఒకరికి ‘మెలియాయిడోసిస్’ పాజిటివ్‌గా తేలింది. 46 ఏళ్ల ఆ వ్యక్తి మోకాలిలోని ద్రవాన్ని సేకరించి పరీక్షకు పంపించగా ఈ వ్యాధి నిర్ధారణ అయిందని గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. మరో పరీక్ష కోసం ఎడమ మోకాలికి ఎంఆర్‌ఐ స్కానింగ్ చేసినట్లు చెప్పారు. ఇదివరకే పాజిటివ్‌గా తేలి, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక రోగి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
కాగా, తురకపాలెంలో ఈ నెల 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అనుమానిత లక్షణాలున్న 72 మంది నుంచి రక్త నమూనాలు సేకరించగా నలుగురిలో బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు గుర్తించామని అధికారులు ప్రకటించారు. గ్రామంలో నిపుణులతో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. వీధులను, పరిసరాలను, నీటి ట్యాంకులను శుభ్రపరిచారు. ఇంటింటికీ ఆహారం, సురక్షిత జలాలు అందిస్తున్నారు.
ఇదిలాఉంటే, తురకపాలెంలో రెండు నెలల వ్యవధిలో 38 మంది వరకు చనిపోవడం గ్రామస్తుల్ని కలవరపెడుతోంది. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. మరణాల వెనక మిస్టరీ ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ప్రభుత్వం మరణాలపై సీరియస్ గా దృష్టి సారించింది. మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో తెలుసుకునే పనిలో పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తురకపాలెం మరణాలపై ఆరాతీశారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరణాలపై సోమవారం లోగా తుది నివేదిక ఇవ్వాలని అధికారులతో చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తురకపాలెం గ్రామంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్లకు వెళ్లి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మెలిన్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి