Share News

Good news for farmers: రైతులకు శుభవార్త.. నేడే అకౌంట్లోకి రూ.7,000!

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:51 PM

Good news for farmers జిల్లా రైతులకు గుడ్‌న్యూస్‌. వారి ఖాతాల్లో రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులు బుధవారం జమ కానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమకానుంది.

Good news for farmers: రైతులకు శుభవార్త.. నేడే అకౌంట్లోకి రూ.7,000!

  • రైతులకు శుభవార్త

  • నేడు అన్నదాత సుఖీభవ నిధులు జమ

  • పీఎం కిసాన్‌తో కలిపి రూ.7 వేలు

  • ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం

  • జిల్లాలో 2,27,700 మందికి రూ.150 కోట్లు

విజయనగరం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులకు గుడ్‌న్యూస్‌. వారి ఖాతాల్లో రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులు బుధవారం జమ కానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమకానుంది.

అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు జమ చేయనుంది. కూటమి అధికారంలోకి వస్తే సాగుకు ఆర్థిక భరోసా కేంద ఏడాదికి రూ.20 వేలను అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు పథకాన్ని అమలుచేస్తున్నారు. మొత్తం మూడు విడతల్లో పీఎం కిసాన్‌తో కలిపి నగదు అందించనున్నారు. ఇప్పటికే ఆగస్టు 2న మొదటి విడత అందించారు. బుధవారం రెండో విడత అందించనున్నారు. చివరి విడతలో కేంద్రంతో కలిపి రూ.6 వేలు డిపాజిట్‌ ఇస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు.. కలిపి రైతులకు రూ.20 వేలు అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఈ పథకాన్ని అమలుచేస్తోంది. సచివాలయాల వారీగా అర్హుల జాబితాను ప్రచురించింది. ఈకైవైసీ చేయించుకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది. ఆధార్‌ కార్డులు, వెబ్‌ల్యాండ్‌లో తప్పిదాలు సరిచేసేందుకూ గడువు ఇచ్చింది.

గజపతినగరంలో అత్యధికం..

జిల్లా వ్యాప్తంగా 2,27,700 మంది రైతులకు రూ.150.03 కోట్లు అందజేయనున్నారు. ఒక్కొక్కరికీ రూ.7 వేలు జమకానుంది. మొత్తం రూ.150 కోట్ల వరకూ జిల్లాకు ఈ ఉమ్మడి పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. జిల్లాలో అత్యధికంగా గజపతినగరం నియోజకవర్గంలో 43,644 మందికి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ అందనుంది. రాజాం నియోజకవర్గంలో 38,691 మందికి, బొబ్బిలి నియోజకవర్గంలో 34,744 మందికి, చీపురుపల్లిలో 36,174 మందికి, విజయనగరం 4,794 మందికి, నెల్లిమర్లలో 27,654 మందికి, ఎస్‌.కోటలో 41,211 మంది రైతులకు ఈ ఉమ్మడి పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.

మాట తప్పిన జగన్‌..

వైసీపీ హయాంలో జగన్‌ మాట తప్పారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు సాగు ప్రోత్సాహం కింద రూ.15 వేలు అందిస్తానని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక రూ.7,500 సాయానికే పరిమితం అయ్యారు. కేంద్రం అందించే రూ.6 వేలతో కలుపుకొని రూ.13,500 అందించారు. అదంతా తామే ఇస్తున్నట్టు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. అప్పట్లో రైతుభరోసా పేరిట సాయం అందించిన జగన్‌ అప్పటివరకూ రైతులకు అందిస్తూ వచ్చిన చాలా రకాల రాయితీలను నిలిపివేశారు. యంత్ర పరికరాల జాడలేదు. రాయితీపై అందించే ఎరువులను తగ్గించేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాయితీ పథకాలను పునరుద్ధరిస్తూనే.. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడం ద్వారా చంద్రబాబు రైతు పక్షపాతి అనిపించుకుంటున్నారు.

ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు కడప జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తారు. అటు తరువాత రైతుల ఖాతాల్లో నిధులు జమవుతాయి. కేంద్రం అందించే పీఎం కిసాన్‌, రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం కలుపుకొని.. ప్రతి రైతు ఖాతాలో రూ.7 వేలు పడుతుంది.

- వీటి రామారావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

ఇవి కూడా చదవండి..

ఒళ్లు జలధరించే వీడియో.. కాంగో రాగి గని వద్ద ప్రమాదంలో 32 మంది మృతి..

మెక్సికోలో జెన్-జెడ్ నిరసనలు.. హింసాత్మక దాడుల్లో 120 మందికి గాయాలు..

Updated Date - Nov 19 , 2025 | 06:29 AM