'Employment' with 20 more crops మరో 20 పంటలతో ‘ఉపాధి’

ABN, Publish Date - Jun 27 , 2025 | 12:00 AM

'Employment' with 20 more crops ఉపాధి పథకం నిధులతో మామిడి, జీడి పంటలను మాత్రమే ఇప్పటివరకు ప్రభుత్వం ప్రోత్సహించింది. తాజాగా మరో 20 రకాల పండ్లు, రెండు రకాల పూల మొక్కల సాగుకు ఉపాధి పథకాన్ని అనుసంధానం చేసింది. ఈ నిర్ణయంతో రైతులకు చాలా మేలు కలుగనుంది.

మరో 20 పంటలతో ‘ఉపాధి’

తాజాగా అనుసంధానం

అర్హులైన రైతులకు వరం

విజయనగరం కలెక్టరేట్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ఉపాధి పథకం నిధులతో మామిడి, జీడి పంటలను మాత్రమే ఇప్పటివరకు ప్రభుత్వం ప్రోత్సహించింది. తాజాగా మరో 20 రకాల పండ్లు, రెండు రకాల పూల మొక్కల సాగుకు ఉపాధి పథకాన్ని అనుసంధానం చేసింది. ఈ నిర్ణయంతో రైతులకు చాలా మేలు కలుగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద వర్షాధారిత, సాగునీటి వసతి ఉన్న వారికి సైతం పండ్లు, పూల తోటల పెంపకానికి అవకాశం కల్పించింది. మునగ పంటను కూడా ప్రోత్సహిస్తోంది. ప్రధానంగా ఎస్‌సీ,ఎస్‌టీ, చిన్నకారు (ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న ) రైతులు ఈ పథకానికి అర్హులు.

రైతులు తమ పొలాల్లో వేసుకున్న పంటలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయనున్నారు. ఇప్పటివరకూ మామిడి, జీడి మామిడి పంటలకు అనుసంధానం చేయగా ఇకపై సీతాఫలం, బత్తాయి, నిమ్మ, జామ, తైవాన్‌ జామ, సపోట, కొబ్బరి, అల్లనేరేడు, చింత, దానిమ్మ, అంజూర, పెదరేగు, అవకాడో, పనస, డ్రాగన్‌ ఫ్రూట్‌, గులాబీ, మల్లె, మునగ, కోకో, జాఫ్రా( సింధూరి), ఆయిల్‌పామ్‌ ఉద్యాన పంటలు సాగు చేసే వారికి సంరక్షణ నిర్వహణ ఖర్చులు చెల్లిస్తారు. మొక్కలు వేయడానికి గోతులు తవ్వకం, మొక్కలు అందించడం, నాటాక నీరు అందించడం తదితర సస్యరక్షణ ప్రక్రియలకు ఉపాధి నిధులు కేటాయిస్తారు. రెండు నుంచి మూడు సంవత్సరాల వరకూ రైతులకు ఈ ఖర్చులు అందిస్తారు.

- ప్రతి మండలంలో 100 ఎకరాల్లో పండ్లు, పూల సాగు చేయాలని లక్ష్యంగా పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 2500 ఎకరాల్లో మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులు నిర్దేశించారు. గత ఏడాది 855 ఎకరాల్లో ఈ పంటలు సాగు చేయగా, ఈసారి రెండింతలు విస్తీర్ణం పెంచారు.

దరఖాస్తు చేసుకునే విధానం

ఈ పంటలు సాగు చేయడానికి ఆసక్తి కలిగిన రైతులకు ఉపాధి హామీ జాబ్‌ కార్డు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టి, చిన్నసన్నకారు రైతులు మండల అభివృద్ధి అధికారికి దరఖాస్తు అందజేయాలి లేదా ఉపాధి హామీ పథకం ఏపీవో లేదా గ్రామ స్థాయిలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు దరఖాస్తు ఇవ్వాలి.

రైతులూ.. వినియోగించుకోండి

జిల్లాలో అర్హులైన రైతులంతా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తమ ప్రాంతానికి అనువైన పంటలు వేసుకుంటే చాలా ఉపయోగం. దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గనున్నాయి. భవిషత్యత్‌లో చాలా మేలు.

- బీఆర్‌ అంబేడ్కర్‌, కలెక్టర్‌

Updated at - Jun 27 , 2025 | 12:00 AM