Share News

Hyndava Shankharavam : బెజవాడలో హైందవ శంఖారావం నేడే

ABN , Publish Date - Jan 05 , 2025 | 04:14 AM

విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ‘హైందవ శంఖారావం’ పేరుతో ఆదివారం విజయవాడ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.

Hyndava Shankharavam : బెజవాడలో హైందవ శంఖారావం నేడే

  • దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే అజెండా

  • సాధువులు, మఠాధిపతులు, హిందూ ప్రముఖుల హాజరు

  • గన్నవరంలో భారీ సభ.. 3,300 మంది పోలీసులతో బందోబస్తు

  • 5 లక్షల మంది వస్తారని నిర్వాహకుల అంచనా

  • విశాఖ-చెన్నై, విశాఖ-హైదరాబాద్‌ హైవేలలో ట్రాఫిక్‌ మళ్లింపు

అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ‘హైందవ శంఖారావం’ పేరుతో ఆదివారం విజయవాడ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే అజెండాగా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సభ జరగనుంది. ఈ సభలో దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖులు హిందూ సమాజం ఆకాంక్షలపై మాట్లాడతారని వీహెచ్‌పీ రాష్ట్రశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సాధువులు, మఠాధిపతులు సహా 4 లక్షల మంది పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌, ముఖ్యులు మిలింద్‌ పరాండే, కోటేశ్వర శర్మ, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవింద దేవ్‌ గిరి మహరాజ్‌ హాజరవుతున్నారని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది నుంచి హిందువులు హాజరు కానున్నట్టు చెప్పారు. సభకు 3,300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొమ్మిది రైళ్లతో పాటు రెండు వేల బస్సులు, భారీగా కార్లు ఇతర వాహనాలు వస్తున్నందున బందోబస్తుతో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టినట్లు ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే వారందరూ రామవరప్పాడు ఫ్లై ఓవర్‌, ఆంధ్రజ్యోతి సెంటర్‌, ముస్తాబాద్‌, సూరంపల్లి అండర్‌ పాస్‌, బీబీ గూడెం, చైతన్య స్కూల్‌ జంక్షన్‌ ద్వారా వెళ్లాలని సూచించారు. పాల్గొనే భక్తులు, కార్యకర్తలు, ప్రముఖులకు ఇబ్బంది లేకుండా సహకరించాలని కోరారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 04:14 AM