Nara Lokesh: విశాఖకు త్వరలో 30 వేల ఉద్యోగాలు: నారా లోకేశ్
ABN , Publish Date - Nov 13 , 2025 | 07:22 PM
విశాఖకు త్వరలో టీసీఎస్ రానుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. టీసీఎస్‌తోపాటు ఇతర కంపెనీలను తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వా పరంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
విశాఖపట్నం, నవంబర్ 13: విశాఖపట్నంలో త్వరలో 30 వేల ఉద్యోగాలు రానున్నాయని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. గురువారం విశాఖపట్నంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. గూగుల్ సెంటర్ ఏర్పాటుకు చాలా కష్టపడ్డామని చెప్పారు. గూగుల్ మన రాష్ట్రానికి రావడానికి కేంద్రం సహకారం సైతం ఉందని తెలిపారు.
విశాఖకు త్వరలో టీసీఎస్ కూడా రానుందన్నారు. కేవలం టీసీఎస్ కాకుండా ఇతర కంపెనీలను తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వా పరంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనపై భారీ మెజారిటీతో గెలిచిన వాళ్లు ఇక్కడే ఉన్నారన్నారు.
పార్లమెంట్ పరంగా చూసుకుంటే స్థానిక ఎంపీ భరత్ అత్యధిక మెజార్టీతో గెలిచారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైద్రాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశారో.. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ను సైతం చేసి చూపిస్తారని తెలిపారు. మొన్న జరిగిన యోగాంధ్ర అద్భుతంగా నిర్వహించినట్లు వివరించారు. త్వరలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు.