Visakha Sai Teja Incident: మహిళా లెక్చరర్ వేధింపులు.. సాయితేజ మృతిపై ఆందోళన..
ABN , Publish Date - Nov 01 , 2025 | 06:42 PM
విశాఖలోని సమతా డిగ్రీ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళా లెక్చరర్ వేధించడంతోనే విద్యార్థి సాయితేజ మృతి చెందాడని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ: సమతా డిగ్రీ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సాయితేజ మృతిపై కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించకపోవడంతో కుటుంబసభ్యులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ గేట్లు, పోలీసులను తోసుకుంటూ లోపలకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు మృతుడు సాయితేజ కుటుంబసభ్యులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. నిందితులను శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
ఆందోళనకు దిగిన వారిని శాంతింప చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఎట్టకేలకు వారిని ధర్నా విరమించేందుకు ఒప్పించారు. ధర్నా అనంతరం ఈ ఘటనపై ద్వారక ఏసీపీ అన్నెపు నరసింహ స్పందించారు. బాధితులు కేసును నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయమన్నారని, వారి డిమాండ్స్‌ను కాలేజ్ యాజమాన్యం పరిశీలించిందని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు డిజిటల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. అటు సైబర్ క్రైమ్, ఉమెన్ సెల్ లోతైన విచారణ చేస్తున్నాయని వెల్లడించారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అని, FSL ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని చెప్పారు. సెన్సిటివ్ కేసు కాబట్టి ఎవరి మీదా నిందలు వేయలేమన్నారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇద్దరు మహిళా సిబ్బందిని కాలేజ్ యాజమాన్యం తాత్కాలికంగా విధుల నుంచి తొలగించిందని వెల్లడించారు. కేసుకు సంబంధించిన తదుపరి విచారణ వివరాలు ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకి అందజేస్తామని ఏసీపీ అన్నెపు నరసింహ స్పష్టం చేశారు.
అసలు కేసేంటి..?
వివరాల్లోకి వెళ్తే.. సాయితేజ అనే విద్యార్థి సమతా డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే, పరీక్షల సమయంలో ఓ మహిళా లెక్చరర్ తనను ఇబ్బంది పెడుతుందని, మార్కులు కావాలనే సరిగా వేయడం లేదని, రికార్డులు పదే పదే రాయిస్తున్నారని తల్లిదండ్రులకు సాయితేజ తెలిపాడు. తనను వేధిస్తున్న లెక్చరర్.. రికార్డులపై సంతకాలు చేయడం లేదని, మీరు వెళ్లి సంతకాలు పెట్టించుకుని రావాలని తల్లిదండ్రులకు చెప్పి పంపించాడు.
కుమారుడు సాయితేజ చెప్పినట్టుగానే తల్లిదండ్రులు లెక్చరర్ ఇంటికి వెళ్లి సంతాలు చేయించుకుని ఇంటికి వచ్చారు. అయితే, ఇంటికి వచ్చిన వారికి చివరికి కడుపుకోత మిగిలింది. సాయితేజ ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో బాధిత తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మహిళా లెక్చరర్ పదే పదే మేసెజ్‌లు పెట్టి వేధించడంతోనే సాయితేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థి సాయితేజ ఘటనపై స్పందించాలని, వేధించిన లెక్చరర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
కాశీబుగ్గకు బయలుదేరిన మంత్రి లోకేష్
కాశీబుగ్గ ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News