Womens Safety: మహిళలకు భరోసా మన విశాఖ
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:22 AM
దేశంలో మహిళల జీవనానికి అత్యంత సురక్షిత నగరంగా విశాఖ నిలిచింది. మహిళల భద్రత విషయంలో దేశంలోనే సురక్షిత నగరాలుగా కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గాంగ్‌టాక్, ఈటానగర్, ముంబై సంయుక్తంగా..
దేశంలోనే సురక్షిత నగరంగా విశాఖపట్నం
మరో ఆరు నగరాలతో కలిసి మొదటి ర్యాంకు
జాతీయ వార్షిక నివేదిక, ఇండెక్స్ సర్వేలో
వెల్లడి.. దక్షిణ భారతం నుంచి విశాఖకే చోటు
నారి-2025 సర్వేలో వెల్లడి
విశాఖపట్నం/మహారాణిపేట, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): దేశంలో మహిళల జీవనానికి అత్యంత సురక్షిత నగరంగా విశాఖ నిలిచింది. మహిళల భద్రత విషయంలో దేశంలోనే సురక్షిత నగరాలుగా కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గాంగ్‌టాక్, ఈటానగర్, ముంబై సంయుక్తంగా మొదటిస్థానంలో నిలిచాయి. దేశంలో మహిళల భద్రత, సురక్షిత జీవన పరిస్థితులపై నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ (నారి)-2025 పేరుతో 31 నగరాల్లో 12,770 మంది మహిళలను సర్వే చేశారు. వారు వెల్లడించిన వివరాలు, అభిప్రాయాలను బట్టి దేశంలో మహిళల భద్రతకు సంబంధించి సురక్షిత నగరాల జాబితాను కమిటీ చైర్‌పర్సన్ విజయ్ రహెద్కర్ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. మహిళల భద్రత స్కోరు జాతీయ స్థాయిలో 65 శాతం ఉండగా విశాఖపట్నం, కోహిమా, ముంబై, భువనేశ్వర్ వంటి నగరాల్లో మెరుగైన స్ర్తీ-పురుష సమానత్వం, మహిళా అనుకూల మౌలిక సదుపాయాలు, పకడ్బందీ పోలీసింగ్, పౌర భాగస్వామ్యం కలిగివున్నట్టు సర్వేలో తేలింది. జాబితాలో తొలిస్థానంలో నిలిచిన ఏడు సిటీల్లో విశాఖ మాత్రమే దక్షిణ భారతం నుంచి ఏకైక నగరం కావడం విశేషం.
మహిళల భద్రతకు చర్యలు: విశాఖ సీపీ
మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ నిలిచిన సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రతబాగ్చి గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. మహిళ భద్రతకు నగరంలో అమలుచేస్తున్న కార్యక్రమాలను వివరించారు. తాను సీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నగరవాసులతోపాటు మహిళలు, విద్యార్థినులు, సీనియర్ సిటిజన్‌లు ఎవరైనా పోలీస్ సహాయం కావాలంటే నేరుగా తనను సంప్రతించేందుకు వీలుగా పర్సనల్ నంబర్‌ను అందుబాటులోకి ఉంచానన్నారు. ఎంతోమంది మహిళలు ఆత్మహత్యకు సిద్ధపడి తనకు ఫోన్‌చేస్తే వారిని సకాలంలో రక్షించగలిగామన్నారు. నగరంలో మహిళల భద్రత కోసం టూ వీలర్స్, ఫోర్ వీలర్ పెట్రోలింగ్ ఏర్పాటుచేశామన్నారు. నగరానికి వచ్చే టూరిస్టుల భద్రత కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాని చెప్పారు. తాము తీసుకుంటున్న చర్యలతోపాటు నగరవాసుల సహకారంతోనే విశాఖ నగరానికి జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..