Visakhapatnam Emerging as Data Hub: డేటా సిటీ విశాఖ
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:33 AM
విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. సంస్థ ప్రతినిధులు ఇందుకు అవసరమైన భూములను కూడా వచ్చి చూసుకున్నారు. భీమిలి నియోజకవర్గం..
నగరంలో మూడు డేటా సెంటర్ల ఏర్పాటు
మొత్తం రూ.82 వేల కోట్ల పెట్టుబడులు
51 వేల కోట్లతో గూగుల్ డేటా సెంటర్
అంతకుముందే అదానీతో ఒక ఒప్పందం
నెల కిందట సిఫీ టెక్నాలజీస్‌తోనూ చర్చలు
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. సంస్థ ప్రతినిధులు ఇందుకు అవసరమైన భూములను కూడా వచ్చి చూసుకున్నారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌కు 200 ఎకరాలు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెండు నెలల క్రితం వెల్లడించారు. ఇదే అంశాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించారు. ‘విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వాస్తవమేనా? ఏపీ ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనలు ఇచ్చింది?’ అని ప్రశ్నించగా... కాపీ రైట్‌కు సంబంధించి చట్టాల సవరణపై చర్చలు జరుగుతున్నాయని, గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు అవుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్ధారించారు. తాజాగా గూగుల్ విశాఖలో రూ.51 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ వస్తుందని... ఇది దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ అవుతుందని తెలుస్తోంది.
అదానీ డేటా సెంటర్...: అదానీ డేటా సెంటర్ ఏర్పాటు దిశగా 2019-2024లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అడుగులు పడ్డాయి. అప్పుడూ, ఇప్పుడూ ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ అదానీ గ్రూపుతో ఒప్పందం చేసుకొని రూ.70 వేల కోట్లతో డేటాసెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసి కేవలం రూ.14,634 కోట్ల పెట్టుబడులనే అనుమతించింది. భూ కేటాయింపును 130 ఎకరాలకు పరిమితం చేసింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ డేటా సెంటర్ ఏర్పాటు ముందుకు కదల్లేదు. ఇప్పుడు మళ్లీ దీనిపై కదలిక వచ్చింది. ఈ సంస్థ 200 మెగావాట్లతో ఒక డేటా సెంటర్‌ను, 100 మెగావాట్లతో మరో సెంటర్‌ను ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. దీని ద్వారా 1,240 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దీని కోసం ప్రత్యేకంగా ఎస్‌పీవీ ఏర్పాటు చేశారు.
రూ.16,466 కోట్లతో సిఫీ టెక్నాలజీస్: నెల రోజుల క్రితం ఐటీ శాఖ మంత్రి లోకేశ్ సిఫీ టెక్నాలజీస్‌కు చెందిన ఇన్‌ఫినిట్ స్పేసెస్ అనుబంధ సంస్థతో చర్చలు జరిపి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పించారు. ఈ సంస్థ రూ.16,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మొదటి దశలో రూ.1,466 కోట్లు వెచ్చిస్తారు. దీని ద్వారా 600 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..