ACB Case Hearing: దర్యాప్తునకు సహకరించకుంటే చర్యలు తీసుకోవచ్చు
ABN , Publish Date - May 01 , 2025 | 04:04 AM
ఏసీబీ అధికారులు విజయ్‌కుమార్‌రెడ్డి పై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి, విచారణకు సహకరిస్తామని తెలిపాడు
విజయ్‌కుమార్‌రెడ్డి కేసులో ఏసీబీకి హైకోర్టు వెసులుబాటు
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మూసివేత
సాక్షి పత్రిక, చానల్‌కు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ తనపై ఏసీబీ నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) మాజీ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. ఆయన దర్యాప్తునకు సహకరించకపోతే.. చట్టనిబంధనల ప్రకారం ఆయనపై తగిన చర్యలు తీసుకునేందుకు ఏసీబీ అధికారులకు వెసులుబాటు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షి దినపత్రిక, సాక్షి చానల్‌కు అనుచిత ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. సాక్షి మీడియా గ్రూపులో పనిచేస్తున్న పలువురు సిబ్బందిని ఐ అండ్ పీఆర్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌లో ఉద్యోగులుగా చట్టవిరుద్ధంగా నియమించారంటూ విజయ్‌కుమార్‌రెడ్డిపై ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.దిల్లీబాబురెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఆయన్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా ఆయన తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 35(3) కింద ఇచ్చిన నోటీసులకు లోబడి విజయ్‌కుమార్‌రెడ్డి ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యారని తెలిపారు. దర్యాప్తు అధికారి కోరినప్పుడు హాజరవుతామని.. విచారణకు సహకరిస్తామని పేర్కొన్నారు. ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. ఏసీబీ నోటీసు, అందులోని షరతులకు కట్టుబడి ఉండేలా పిటిషనర్‌ను ఆదేశించాలని కోరారు. దర్యాప్తునకు సహకరించకుంటే తగిన చర్యలు తీసుకునే వెసులుబాటు ఇవ్వాలని అభ్యర్థించారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మూసివేయాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కోరారని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసిన న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ప్రకటించి విచారణను మూసివేశారు.