Vijayawada Police : ‘స్పా’ ముసుగులో హై‘టెక్’ వ్యభిచారం
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:31 AM
హైటెక్ నిఘా, భద్రత మధ్య సాగుతున్న వ్యభిచారాన్ని విజయవాడ పోలీసులు బట్టబయలు చేశారు.

యువకుడి స్టింగ్ ఆపరేషన్.. సీపీకి సమాచారం
గుట్టురట్టు చేసిన విజయవాడ పోలీసులు
10 మంది యువతులు, 11 మంది విటులు అరెస్టు
విటుల్లో వైసీపీ నేత శంకర్ నాయక్
విజయవాడ, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): హైటెక్ నిఘా, భద్రత మధ్య సాగుతున్న వ్యభిచారాన్ని విజయవాడ పోలీసులు బట్టబయలు చేశారు. విజయవాడ వెటర్నరీ కాలనీలోని ఫీడర్ రోడ్డులో ఉన్న మూడంతస్తుల భవనంలో గురునానక్ కాలనీకి చెందిన చలసాని ప్రసన్న భార్గవ్ స్టూడియో 9 పేరుతో స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందిన యువతులను ఉపాధి కల్పన పేరుతో తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. అయితే, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు స్టింగ్ ఆపరేషన్ చేసి పోలీసు కమిషనర్‌కు వీడియోలను అందజేశాడు. దీంతో మాచవరం ఇన్‌స్పెక్టర్ ప్రకాశ్ మూడు బృందాలతో శుక్రవారం రాత్రి స్పా సెంటర్‌లో ఆకస్మిక సోదాలు జరిపా రు. పోలీసుల రాకతో ఈ భవనం నుంచి పక్కన భవనంలోకి దాటేసిన పది మంది యువతులు, 11 మంది విటులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర గిరిజన కమిషన్ సభ్యుడిగా పనిచేసిన వైసీపీ నేత శంకర్ నాయక్ ఒక గదిలో మంచం కింద దాక్కోగా, పోలీసులు బయటికి లాక్కొచ్చి స్టేషన్‌కు తరలించారు. కాగా.. పోలీసులు తనిఖీలకు వస్తే ముందుగా గుర్తించడానికి స్పా సెంటర్‌కు వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తలుపులను టెక్నాలజీకి అనుసంధానం చేసి, వేలిముద్రల స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. బయట ఎవరు న్నారో తెలుసుకోడానికి తలుపులకు చిన్నచిన్న అద్దాలతో కూడిన పరికరాలు అమర్చాడు. పోలీసులు వస్తే పక్కనే ఉన్న భవనం పైకి వెళ్లిపోవడానికి యువతులకు, సిబ్బందికి భార్గవ్ శిక్షణ ఇచ్చాడు. పోలీసుల సోదాలు చేయడంతో భార్గవ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. స్పా సెంటర్ మేనేజర్ దగ్గుబాటి శ్యాంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విటులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా మరో భవనంలో ముగ్గురు యువతులతో కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. సీసీటీవీల ఫుటేజీ క్లౌడ్‌లో భద్రంగా ఉండేలా ఐపీ అడ్ర్‌సల ద్వారా వ్యవస్థను నిర్వహిస్తుండడం గమనార్హం.