Kakinada: చేసిందంతా విక్రాంత్‌రెడ్డే
ABN , Publish Date - Mar 13 , 2025 | 03:14 AM
కాకినాడ సీ పోర్టు ప్రైవేటు లిమిటెడ్ ‘వ్యవహారం’లో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డే సూత్రధారని మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు.

కాకినాడ సీ పోర్టు ‘డీల్’లో సూత్రధారి
సీ పోర్టు వ్యవహారాన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్‌రెడ్డే నడిపించారని కేవీ రావు మా కామన్
ఫ్రెండ్స్‌కు చెప్పారు. ఇదే విషయాన్ని సీఐడీకి
వివరించాను. వైవీ సుబ్బారెడ్డి కుమారుడిగా విక్రాంత్‌రెడ్డి నాకు తెలుసు’’
- విజయసాయిరెడ్డి
విజయవాడ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): కాకినాడ సీ పోర్టు ప్రైవేటు లిమిటెడ్ ‘వ్యవహారం’లో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డే సూత్రధారని మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. కేవీ రావు, అరబిందో కంపెనీ శరత్‌చంద్రారెడ్డి షేర్ల ‘డీల్’లో విక్రాంత్‌రెడ్డి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించారన్నారు. బుధవారం విజయవాడ కానూరులోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారించారు. సుమారు మూడు గంటల పాటు విచారణ సాగింది. అనంతరం బయటకు వచ్చిన విజయసాయి మీడియాతో మాట్లాడారు. సీ పోర్టు వాటాలు లాక్కోవడంలో ఆది నుంచి చివరి వరకు తన ప్రమేయం లేదని స్పష్టంగా చెబుతున్నానన్నారు. కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సీఐడీ అధికారులు విచారించారని తెలిపారు. ‘‘కేవీ రావు తెలుసా? అని అధికారులు ప్రశ్నించారు. ఆయనతో ముఖ పరిచయం ఉంది తప్ప, ఎలాంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక సంబంధాలు లేవని అధికారులకు స్పష్టం చేశాను. అరబిందో కంపెనీ నుంచి సుమారుగా రూ.500 కోట్ల బదిలీ జరిగిన విషయంపై ప్రశ్నించారు. దాని గురించి ఎవరూ నాకు చెప్పలేదని, తెలియదని సమాధానం ఇచ్చాను. నా కుమార్తెను అరబిందోకు చెందిన కుటుంబంలో ఇచ్చానని, ఆ కంపెనీకి సంబంధించిన ఆర్థిక, వ్యాపార వ్యవహారాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని తెలిపాను. విక్రాంత్‌రెడ్డి తెలుసా అని అధికారులు అడిగారు. వైవీ సుబ్బారెడ్డి కుమారుడిగా నాకు తెలుసునని చెప్పాను. సీ పోర్టు వ్యవహారాల్లో జరిగిన లావాదేవీలు నేను, విక్రాంత్‌రెడ్డి కలిసి చేశామా? అని అధికారులు ప్రశ్నించారు. ఈ విషయంలో నా ప్రమేయం ఏమాత్రం లేదని చెప్పాను. ఆరోపణలు వచ్చిన కేసులో నా పేరు ఎందుకు చేర్చారని కొంతమంది కామన్ స్నేహితుల ద్వారా అడిగించాను. ఒక అధికారి ఆదేశాలతో నా పేరు చేర్చానని కేవీ రావు కామన్ స్నేహితుడికి చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి, కేవీ రావు అత్యంత ఆప్త మిత్రులని సీఐడీకి వివరించాను. విక్రాంత్‌రెడ్డిని కేవీ రావుకు నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుబ్బారెడ్డి ఎప్పుడు కాలిఫోర్నియాకు వెళ్లినా కేవీ రావుకు చెందిన రాజభవనంలో నివసిస్తారు. సీ పోర్టు వ్యవహారాన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్‌రెడ్డి నడిపించారని కేవీ రావు కామన్ స్నేహితులకు చెప్పారు. ఇదే విషయాన్ని సీఐడీకి వివరించాను’’ అని వెల్లడించారు.
ఆ విషయం ధనుంజయరెడ్డి చెప్పారు
‘‘ఆడిట్ నివేదికలకు సంబంధించి శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ నా పేరు చెబుతోందని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. నా పేరు చెప్పిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా చెప్పాలని జవాబు ఇచ్చాను. వాళ్లు ఎవరో నాకు తెలియదని చెప్పాను. మనోహర్ చౌదరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టడ్ అకౌంటెంట్స్‌కు అధ్యక్షుడన్న విషయం తెలుసునని సమాధానం చెప్పాను. ముంబైకి చెందిన కంపెనీ ఏమాత్రం తెలియదని వివరించాను. ఆడిట్ కోసం శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీని ధనుంజయరెడ్డి ద్వారా నేనే సిఫార్సు చేయించానని అధికారులు అడిగారు. శ్రీధర్ అండ్ సంతానం కంపెనీని అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న కరికాల వలవన్ తీసుకొచ్చారని ధనుంజయరెడ్డి చెప్పారని అధికారులకు తెలియజేశాను. ఇందులో ధనుంజయరెడ్డికి సంబంధం లేదు. కరికాల వలవన్ తమిళుడు కాబట్టి, తమిళనాడుకు చెందిన కంపెనీని ఆయన అపాయింట్ చేశారని తెలిసింది. ఇదే విషయాన్ని అధికారులకు చెప్పాను. ఉత్తరాంధ్రలో లేటరైట్ గనుల్లో వేల కోట్ల రూపాయలను విక్రాంత్‌రెడ్డితో కలిసి ఆర్జించానని అధికారులు అడిగారు. విక్రాంత్‌రెడ్డి కోట్లాది రూపాయలు ఆర్జించారో లేదో నాకు తెలియదని, నేను ఉత్తరాంధ్రలో ప్రజాదర్బార్ నిర్వహించినప్పుడు విక్రాంత్‌రెడ్డికి చెందిన మైనింగ్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించాలని కొందరు వినతి పత్రాలు ఇచ్చారన్న విషయాన్ని అధికారులకు వివరించాను’’ అని విజయసాయి తెలిపారు.
జగన్ పాత్ర గురించి ప్రశ్నించారు
ఈడీ పది కేసులతో పాటు సీబీఐ 11 కేసుల్లో అప్పటి జేడీ లక్ష్మీనారాయణ తనను ఏ2గా పెట్టారు కాబట్టి కాకినాడ సీ పోర్టు కేసులోను ఏ2గా చేర్చారని విజయసాయి అన్నారు. తనకు ఏ2ను స్థిరం చేశారని వ్యాఖ్యానించారు. ఎక్కడ ఏ కేసు నమోదు చేసినా తనను ఏ2గా చేశారన్నారు. కాకినాడ సీ పోర్టు కేసు నమోదు చేసే సమయానికి తాను ఇంకా ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేయలేదని తెలిపారు. పార్లమెంటు వెలుపల మీడియాతో ఈ కేసుపై మాట్లాడానన్నారు. అప్పటికి తనకు పూర్తి వివరాలు తెలియవన్నారు. ఇప్పుడు ఈ కేసుపై ఎవరెవరు ఏం చేశారు? ఎలా చేశారన్న దానిపై పూర్తి అవగాహన వచ్చిందన్నారు. కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో జగన్ లబ్ధిదారుడని, ఆయనను పక్కకు తప్పించడానికి తాను, విక్రాంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నామని సీఐడీ అధికారులు ప్రశ్నించారని తెలిపారు. ఆ విషయాలు ఏవీ తనకు తెలియవని చెప్పానన్నారు. ఈ కేసులో ఉన్న శరత్‌చంద్రారెడ్డి తన అల్లుడికి సోదరుడు కాబట్టి తాను చెప్పిన విషయాన్ని నమ్మకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశానన్నారు. తన అల్లుడికి సంబంధించిన వ్యాపార వ్యవహారాల్లో తాను ఏనాడూ జోక్యం చేసుకోలేదని చెప్పారు. తనకు కుటుంబ సంబంధాలు ముఖ్యమని, వ్యాపార సంబంధాలు ముఖ్యం కాదని వ్యాఖ్యానించారు. ఆ కంపెనీలో ఒక్క ఉద్యోగమూ తాను అడగలేదన్నారు. జగన్‌కు ఈ డీల్‌లో సంబంధం ఉందా అని అఽధికారులు అడగ్గా, ఆయనకు సంబంధం లేదని చెప్పానని వివరించారు.
ఫిర్యాదులో రాజకీయ కుట్ర
కాకినాడ సీ పోర్టుకు సంబంధించి కేవీ రావు దురుద్దేశపూర్వకంగా ఫిర్యాదుచేశారని విజయసాయి వ్యాఖ్యానించారు. ఈ ఫిర్యాదులో రాజకీయకుట్ర దాగి ఉందన్నారు. ఈ విషయాన్ని ఇంతకుముందు చెప్పానని, ఎప్పుడూ చెబుతానని అన్నారు. తనపై ఫిర్యాదును ఎవరు డ్రాఫ్ట్ చేశారన్న విషయం ఓ అధికారికి, కేవీ రావుకు తెలుసన్నారు. తనకు రక్షణ అవసరం కాబట్టి ఆ అధికారి ఎవరన్నది బహిరంగంగా చెప్పలేనన్నారు. కేసు ఇక్కడితో ఆగినా, ఆగకపోయినా తనకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. కేవీ రావు తనతో మాట్లాడినట్టు, కేవీ రావుతో తాను మాట్లాడినట్టు కాల్ రికార్డ్స్ ద్వారా నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రజాదర్బారు నిర్వహించినప్పుడు ఉద్యోగాల కోసం వినతి పత్రాలు ఇచ్చినప్పుడు ఫోన్ చేసేవాడినని, ఎవరి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించలేదని, ఆశించేవాడిని కాదని అన్నారు.
మరోసారి విచారణకు!
కానూరులోని సీఐడీ విజయవాడ ప్రాంతీయ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు విజయసాయిరెడ్డి న్యాయవాదులతో కలిసి చేరుకున్నారు. సిబ్బంది న్యాయవాదులను గేటు వద్ద అడ్డుకున్నారు. విజయసాయిని మాత్రమే లోపలికి పంపారు. అదనపు ఎస్పీ ప్రసాద్, డీఎస్పీ శ్రీనివాసరావు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్‌ఐలు ఆయనను విచారించారు. అనేక ప్రశ్నలను వారు సంధించారు. ప్రతి ప్రశ్నకు విజయసాయి సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. మరికొద్ది రోజుల్లో ఆయనను మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
విజయసాయి కేసులపై ఆరా
కాకినాడ సీ పోర్టు షేర్లను కేవీ రావు నుంచి బదలాయించుకున్న తర్వాత విక్రాంత్‌రెడ్డికి, ఆయనకు మధ్య బంధం మరింత బలపడిందని సీఐడీ విచారణలో విజయసాయి చెప్పినట్టు సమాచారం. అందుకే షేర్లు బదిలీ అయినా కాకినాడ సీ పోర్టు ప్రైవేట్ లిమిటెడ్‌కు కేవీ రావు చైర్మన్‌గా కొనసాగారని వివరించారు. ఈ షేర్ల బదిలీ వ్యవహారంలో తన ప్రమేయం ఉందో లేదో స్వయంగా కేవీ రావును పిలిచి మాట్లాడాలని సూచించినట్టు తెలిసింది. ఇప్పటివరకు కేవీ రావుకు తాను ఏనాడూ ఫోన్ చేయలేదని, షేర్ల వ్యవహారం గురించి మాట్లాడలేదని చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దర్యాప్తు అధికారులు విజయసాయిపై ఉన్న కేసుల గురించి ప్రశ్నించగా.. తనపై కేసులున్నమాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అందుకోసమే తనను ఈ కేసులో ఏ2గా పెట్టారన్నారు. తమకు పాత కేసులతో సంబంధం లేదని, ఫిర్యాదును బట్టి కేసు నమోదు చేశామని అధికారులు అన్నట్టు తెలిసింది. విజయసాయి చెప్పిన ప్రతి మాటను అధికారులు వాంగ్మూలంగా నమోదు చేశారు.
మద్యం స్కామ్ సూత్రధారి కసిరెడ్డే...
వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మద్యం కుంభకోణం సూత్రధారి అని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని ఇంతకుముందు చెప్పానని, భవిష్యత్తులో మరిన్ని వివరాలు చెప్పాల్సివచ్చినా చెబుతానని అన్నారు. ‘‘భయం అనేది నా రక్తంలో లేదు. జగన్ మీద ఇంతకుముందు భక్తి, ప్రేమ ఉండేవి. ప్రస్తుతం అవి దేవుడి మీద మాత్రమే ఉన్నాయి. జగన్ చాలా పదవులు ఇచ్చారు. కానీ, అక్కడ పొందిన అవమానాలు, ఇబ్బందులతో మనసు విరిగిపోయింది. నేను ఏ ప్రలోభాలకూ లొంగలేదు. ఆత్మగౌరవం, విశ్వసనీయతను కోల్పోలేదు. జగన్‌లోనే మార్పు వచ్చింది.’’ అని విజయసాయి అన్నారు.