AP High Court: పోలీసు అధికారులు తప్పుడు అఫిడవిట్లు వేశారు
ABN , Publish Date - May 06 , 2025 | 03:59 AM
హైకోర్టు వర్రా రవీందర్‌రెడ్డి అక్రమ అరెస్టు కేసులో పోలీసులు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని పేర్కొంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపి తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.
వర్రా రవీందర్‌రెడ్డి భార్య పిటిషన్‌పై తుది విచారణ జరుపుతాం: హైకోర్టు
వివరాలు తెప్పించుకునేందుకు సమయం కోరిన ఏజీపీ
తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా
సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని ఆదేశం
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): వైసీసీ సానుభూతిపరుడు వర్రా రవీందర్‌రెడ్డి అరెస్టుకు సంబంధించి పోలీసులు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు ముందు హాజరుపరచాల్సిందిగా వారిని ఆదేశించాలని కోరుతూ రవీందర్‌రెడ్డి భార్య కల్యాణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై తుది విచారణ జరుపుతామంది. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రిజిస్ట్రార్(జ్యుడీషియల్) సమక్షంలో కర్నూలు టోల్ ప్లాజా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించామన్నారు. వర్రా రవీందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు నవంబరు 8న టోల్ ప్లాజా వద్ద నిర్బంధంలోకి తీసుకున్నారని.. ఆ ఫుటేజ్‌ను రిజిస్ట్రార్ కోర్టు ముందు ఉంచారని తెలిపారు. నిందితులను పోలీసులు గత ఏడాది నవంబరు 8న అరెస్టు చేసి 11న అరెస్టు చేసినట్లుగా అఫిడవిట్లు వేశారన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ప్రతివాదులుగా ఉన్న పోలీసు అధికారులు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారని అభిప్రాయపడింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి 5 నెలలు గడచిందని, వ్యాజ్యంపై తుది విచారణ జరుపుతామని పేర్కొంది.
ఏజీపీ స్పందిస్తూ.. రిజిస్ట్రార్ వద్ద సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో తానూ ఉన్నానని.. పోలీసుల నుంచి వివరాలు తెప్పించుకుని వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం అంగీకరించి.. విచారణను జూన్ 17కి వాయిదా వేసింది. సీసీటీవీ ఫుటేజ్‌ను సీల్డ్‌కవర్‌లో భద్రపరచి, తదుపరి విచారణలో అందజేయాలని రిజిస్ట్రార్(జ్యుడీషియల్)ను ఆదేశించింది.