Share News

Vijayawada Police : రూ. రెండున్నర కోట్ల యాపిల్‌ ఫోన్లు కొట్టేశారు

ABN , Publish Date - Feb 08 , 2025 | 04:56 AM

ఎలక్ట్రానిక్‌ పరికరాల గోడౌన్‌లోకి చొరబడి ఐఫోన్లు, ట్యాబ్‌లు, యూఎ్‌సబీ పరికరాలను దొంగిలించారు.

Vijayawada Police : రూ. రెండున్నర కోట్ల యాపిల్‌ ఫోన్లు కొట్టేశారు

విజయవాడ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌ దొంగలు బెజవాడలో బీభత్సం సృష్టించారు. ఎలక్ట్రానిక్‌ పరికరాల గోడౌన్‌లోకి చొరబడి ఐఫోన్లు, ట్యాబ్‌లు, యూఎ్‌సబీ పరికరాలను దొంగిలించారు. అమెరికాకు చెందిన ఇన్‌గ్రాం మైక్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ దేశంలో సెల్‌ఫోన్ల షోరూంలకు సెల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ పరికరాలు సరఫరా చేస్తోంది. విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులో ఉన్న గోడౌన్‌ వద్దకు ఈ నెల 5న అర్ధరాత్రి కారులో వచ్చిన ఆరుగురు ఆగంతకులు కట్టర్‌తో షట్టర్‌ను కత్తిరించి లోపలకు ప్రవేశించారు. సీసీ కెమెరాల్లో ముఖాలు కనిపించకుండా ప్రయత్నించినా వారి ఛాయాచిత్రాలు స్పష్టంగా రికార్డయ్యాయి. అట్టపెట్టెల్లో ఉన్న 271 యాపిల్‌ ప్రో, మ్యాక్స్‌ ఫోన్లు, రెండు ఐప్యాడ్స్‌, 75 ఇయర్‌ పాడ్స్‌, ఒక మౌస్‌, ఒక అడాప్టర్‌, పది లెనోవో ట్యాబ్‌లను దొంగిలించారు. పటమట పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సీసీ కెమెరా ఫుటేజీలను బట్టి ఆ దొంగలు యూపీకి చెందినవారై ఉంటారని అంచనాకు వచ్చారు. చోరీ సొత్తు విలువ రూ.2.51 కోట్లు ఉంటుందని సీఐ వి.పవన్‌ కిశోర్‌ తెలిపారు. కాగా, నిందితులను బిహార్‌ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండగా, అక్కడి పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది.

Updated Date - Feb 08 , 2025 | 04:57 AM