Urea Supply Boost: యూరియా వచ్చింది
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:50 AM
రాష్ట్రంలో యూరియా కొరతను తీర్చడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెప్టెంబరు 6న రావాల్సిన 10,350 టన్నుల యూరియాను సీఎం చంద్రబాబు చొరవతో...
గంగవరం పోర్టుకు చేరిన 10,350 టన్నులు
వచ్చే వారం మరో 25 వేల టన్నులు: మంత్రి అచ్చెన్న
అమరావతి, శ్రీకాకుళం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వారం ముందే రాష్ట్రానికి పంపింది. ఐపీఎల్(ఇండియన్ పొటాష్ లిమిటెడ్) కంపెనీ ద్వారా గురువారం గంగవరం పోర్టుకు యూరియా చేరుకుంది. నౌక నుంచి యూరియాను శుక్రవారం దిగుమతి చేసుకోనున్నారు. వారం ముందుగానే యూరియాను సరఫరా చేసినందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘యూరియాను గంగవరం పోర్టులో దిగుమతి చేస్తున్నాం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని వ్యవసాయ సాగు పరిస్థితి, వాటి దశలను బట్టి యూరియా అవసరాలను శాస్త్రీయంగా బేరీజు చేసుకుంటూ ప్రణాళిక బద్ధంగా అత్యంత అవసరమున్న ప్రాంతాలకు సరఫరా చేయాలి’ అని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావును మంత్రి ఆదేశించారు. అలాగే, సెప్టెంబరు మొదటి వారంలో కాకినాడ పోర్టుకు మరో 25వేల టన్నుల యూరియా పంపేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. తక్షణం పంటలకు అవసరమైన మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని రైతులకు మంత్రి సూచించారు. రబీ సీజన్ కోసం ముందే కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను ఇతర రాష్ట్రాలకు దారి మళ్లించకుండా, అధిక ధరలకు విక్రయించకుండా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘా కొనసాగుతోందని తెలిపారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో వ్యవసాయ, పోలీసు, విజిలెన్స్, రెవెన్యూ, పరిశ్రమల అధికారులతో సంయుక్త టీమ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తున్నామ వివరించారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..