Share News

Guntur: యూరియా అమ్మేది లేదు

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:12 AM

రాష్ట్రంలో యూరియా అమ్మకాల వ్యవహారం వివాదంగా మారింది. యూరియా అమ్మకాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర ఫెర్టిలైజర్‌, సీడ్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది.

Guntur: యూరియా అమ్మేది లేదు

  • రాష్ట్రంలో చేతులెత్తేసిన డీలర్లు

  • కాంప్లెక్స్‌ ఎరువుల లింక్‌తో బెంబేలు

  • మార్క్‌ఫెడ్‌కే ఇచ్చుకోవాలని సూచన

గుంటూరు సిటీ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా అమ్మకాల వ్యవహారం వివాదంగా మారింది. యూరియా అమ్మకాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాష్ట్ర ఫెర్టిలైజర్‌, సీడ్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయి సమావేశంలో యూరియా అమ్మకాలకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించినట్లు అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. యూరియా కొనుగోలు సమయంలో నానో, కాంప్లెక్స్‌ ఎరువులు కొనుగోలు చేయాలని కంపెనీలు ఒత్తిడి చేస్తుండటమే వారి నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. 10 టన్నుల యూరియా కొనుగోలు చేయాలంటే 20:20 వంటి కాంప్లెక్స్‌ ఎరువుల కోసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వెచ్చించాల్సి వస్తుండటంతో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. యూరియా సరఫరా విషయంలో కూడా కంపెనీలపై గుర్రుగా ఉన్నారు.


వాస్తవానికి యూరియాను డీలర్లు.. నిల్వ కేంద్రాల వరకు ఉచితంగా సరఫరా చేయాల్సిన బాధ్యత కంపెనీలదే. అయితే రైళ్లలో ఆయా పట్టణాలకు వరకు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. అక్కడ నుంచి నిల్వ పాయింట్‌కు తెచ్చేందుకు ఒక్కొక్క బస్తాకు అదనంగా రూ.40 ఖర్చవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఒక్కొక్క యూరియా బస్తా రూ.266.50 మాత్రమే అమ్మాలని స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. అదనంగా వసూలు చేేస్త విజిలెన్స్‌, వ్యవసాయ శాఖలు కేసులు నమోదు చేస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. ఈ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందన ఉండడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఆ నేపథ్యంలో అసలు యూరియా అమ్మకాల జోలికి పోకుండా ఉండటం ఉత్తమమని భావిస్తున్నారు. ఈ నెల 10న గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో వ్యవసాయ ఉన్నతాధికారులకు యూరియా అమ్మకాలు జరపబోమని స్పష్టం చేసిన వ్యాపారులు.. జిల్లా స్థాయి సమావేశాల్లోనూ దానికి అనుగుణంగా తీర్మానాలు చేస్తున్నారు.


అమ్మకం మా వల్ల కాదు

‘‘యూరియా అమ్మకాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వేల మంది డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. కాంప్లెక్స్‌ ఎరువులు కొనాల్సి రావటం, నిల్వ కేంద్రాల వరకు యూరియా సరఫరా చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ బాధలు పడలేక యూరియా అమ్మకాలను మార్క్‌ఫెడ్‌, రైతు సేవా కేంద్రాలు, సొసైటీల ద్వారా విక్రయించాలని మేమే అధికారులకు విజ్ఞప్తి చేశాం.’’

- వీవీ నాగిరెడ్డి, ఫెర్టిలైజర్‌, సీడ్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

Updated Date - Jun 26 , 2025 | 05:12 AM