Nellore: పేదలపై ఎంత కక్ష..!
ABN , Publish Date - Jun 19 , 2025 | 06:57 AM
నెల్లూరు నగరంలోని బుజబుజ నెల్లూరు ప్రాంతంలో ఆరేళ్లుగా మూలన పడి ఉన్న చెత్త తరలింపు వాహనాలన్నీ పేదలకు పంపిణీ చేయాల్సినవని తేలింది.
ఆ వాహనాలన్నీ ఎస్సీ కార్పొరేషన్‌వట..
2019లో కక్షతో పంపిణీ చేయకుండా ఆపేసిన వైసీపీ
అధికారులను కదలించిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం
నెల్లూరు, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు నగరంలోని బుజబుజ నెల్లూరు ప్రాంతంలో ఆరేళ్లుగా మూలన పడి ఉన్న చెత్త తరలింపు వాహనాలన్నీ పేదలకు పంపిణీ చేయాల్సినవని తేలింది. నిరుద్యోగులకు సబ్సిడీతో అందించాల్సిన వాహనాలను గత ప్రభుత్వం కక్షగట్టి పంపిణీ చేయకుండా నిలిపేసినట్లు స్పష్టమైంది. 2019 మార్చిలో 23 మినీ ట్రాక్టర్లు, 53 ఈ-ఆటోలు జిల్లాకు రాగా... వాటిని లబ్ధిదారులకు అందించకుండా ఆపేశారు. వీటి విలువ సుమారు రూ.4.50 కోట్లు ఉంటుందని అంచనా. బుధవారం ‘చెత్తలా వాహనాలు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగాన్ని కదిలించింది. ఈ వాహనాలన్నీ ఎస్సీ కార్పొరేషన్‌కు చెందినవిగా తేలింది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ వాహనాలను పేదలకు సబ్సిడీతో అందించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం ఓ ఏజన్సీ నుంచి ఈ వాహనాలను కొనుగోలు చేయగా, అవి 2019 మార్చిలో నెల్లూరుకు చేరాయి. వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ జరగలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ వాహనాలను పంపిణీ చేయకుండా ఆపేసింది. ఇప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ ఈ వాహనాల దుస్థితిని వెలుగులోకి తీసుకురావడంతో యంత్రాంగం కదిలింది. మరి ఇప్పటికైనా ఈ వాహనాలను లబ్ధిదారులకు అందిస్తారో లేదో చూడాలి.