Religious Controversy: వివాదంలో టీటీడీ ఉద్యోగి
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:25 AM
టీటీడీ ఉద్యోగిగా పని చేస్తూ చర్చికి వెళ్తున్నారన్న అభియోగంపై ఏఈవో రాజశేఖర్‌బాబు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే..
తనిఖీల కోసం కర్నూలు వచ్చిన క్వాలిటీ కంట్రోల్ డీఈఈ
ఆయన వచ్చిన కారుపై అన్యమత వచనాలు
టీటీడీ కల్యాణ మండపం ఆవరణలోనే కారు పార్కింగ్
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది
కర్నూలు, జూలై 14(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఉద్యోగిగా పని చేస్తూ చర్చికి వెళ్తున్నారన్న అభియోగంపై ఏఈవో రాజశేఖర్‌బాబు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే టీటీడీలో పని చేస్తున్న మరో ఉద్యోగి అన్యమత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కర్నూలులో టీటీడీ కల్యాణ మండపం, ఎమ్మిగనూరు టీటీడీ కల్యాణ మండపం రీ మోడిఫికేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను తనిఖీ చేయడానికి టీటీడీ క్వాలిటీ కంట్రోల్ డీఈఈ ఎలియేజర్ శనివారం ఏపీ21బీఎన్3265 నంబరు కారులో కర్నూలు వచ్చారు. తనిఖీల అనంతరం రాత్రి కర్నూలులోని కల్యాణ మండపంలోనే బస చేసినట్లు సమాచారం. ఆ కారు ముందు, వెనకా క్రీస్తు బోధనలు రాసి ఉన్నాయి. టీటీడీ ఉద్యోగిగా ఉంటూ.. అన్యమత ప్రచారానికి సంబంధించిన వచనాలు రాసి ఉన్న కారులో రావడమే కాకుండా, కల్యాణ మండపం ఆవరణలో కారును పార్కింగ్ చేయడం వివాదాస్పదంగా మారింది. కల్యాణ మండపం ఆవరణలో డీఈఈ పార్కింగ్ చేసిన కారును స్థానిక ఉద్యోగులు ఫొటోలు ఆదివారం టీటీడీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా పనులు పర్యవేక్షించే ఇంజనీరింగ్ అధికారులు లేకుండానే తనిఖీలకు రావడం, ఆయన వచ్చిన కారుపై అన్యమత బోధనలు రాసి ఉండడం వివాదంగా మారింది. ఆ కారు ఓనర్ బొట్టె ఎలియేజర్ ఆయన తండ్రి బి.ఏసయ్యగా విచారణలో తేలింది.