Share News

Inquiry Commission : తొక్కిసలాట ఎలా జరిగింది?

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:56 AM

తిరుపతి కలెక్టరేట్‌లోని కమిషన్‌ కార్యాలయంలో చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఎదుట 11 మంది బాధితులు హాజరై వాంగ్మూలమిచ్చారు.

 Inquiry Commission : తొక్కిసలాట ఎలా జరిగింది?

  • తిరుపతి ఘటనపై మలివిడత న్యాయ విచారణ ప్రారంభం

  • పార్కులోకి పంపేసి తాళాలు వేసేశారు

  • ఒక్కసారిగా గేట్లు తెరవడంతో అంతా అటువైపు పరుగులు

  • అక్కడ భక్తులను కట్టడి చేసే పరిస్థితి లేదు

  • ఏకసభ్య కమిషన్‌ ముందు బాధితుల వాంగ్మూలం

తిరుపతి (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్‌ మలివిడత విచారణ శనివారం ప్రారంభమైంది. తిరుపతి కలెక్టరేట్‌లోని కమిషన్‌ కార్యాలయంలో చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఎదుట 11 మంది బాధితులు హాజరై వాంగ్మూలమిచ్చారు. అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయా? సకాలంలో వైద్యం అందిందా? టీటీడీ నుంచీ పరిహారం అందిందా? వంటి ప్రశ్నలు వేసి కమిషన్‌ చైర్మన్‌ వివరాలు నమోదు చేసుకున్నారు.

వెనుక నుంచి నెట్టేశారు: బైరాగిపట్టెడలో వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ కేంద్రం పక్కనే ఉన్న పద్మావతీ పార్కులోకి తమను గుంపులుగా తోసేసి గేట్లకు తాళాలు వేశారని బాధితులు కమిషన్‌కు వెల్లడించారు. టోకెన్ల కోసం ఆత్రంగా వేచిచూస్తుండగా గేట్లు తెరవడంతో అందరూ ఒక్కసారిగా అటువైపు పరుగులు తీశారని, వెనుక నుంచి భక్తులు నెట్టుకుంటూ ముందుకు రావడంతో తాము కిందపడిపోయి గాయపడ్డామని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం నుంచి వచ్చిన తొమ్మిది మంది బాధితులు చెప్పినట్లు తెలిసింది. తోపులాటను ఎవరూ కట్టడి చేసే పరిస్థితి లేకపోయిందన్నట్టు సమాచారం. అప్పట్లో గాయపడ్డ తాను ఇప్పటికీ మెడ నొప్పి, వినికిడి సమస్యలతో బాధ పడుతున్నానంటూ ఓ మహిళ వెల్లడించినట్టు తెలిసింది. తొక్కిసలాట ఘటనలో గాయపడిన విశాఖవాసులు దూరాభారంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నామని తెలపడంతో వారితో జూమ్‌ లేదా వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి విచారించాలని కమిషన్‌ నిర్ణయించినట్టు సమాచారం. కాగా, ప్రభుత్వం కేటాయించిన ఎస్కార్ట్‌ వాహనాన్ని కమిషన్‌ చైర్మన్‌ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. గత నెల 8న తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందడంతో పాటు మరో 44 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

Updated Date - Feb 23 , 2025 | 04:56 AM