Tirumala : శ్రీవారి సేవనూ అమ్మేశాడు!
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:11 AM
టీటీడీ ఉచితంగా కేటాయించే శ్రీవారి సేవను ఓ దళారీ అధిక ధరకు మహిళలకు విక్రయించి మోసం చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది.

ఉచిత సేవకు రూ.11,200 వసూలు చేసిన దళారీ
తిరుమల, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఉచితంగా కేటాయించే శ్రీవారి సేవను ఓ దళారీ అధిక ధరకు మహిళలకు విక్రయించి మోసం చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదుతో తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దళారీని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన కృష్ణారావు దాదాపు 15 వాట్సాప్ గ్రూపులను నడుపుతున్నాడు. ఆ గ్రూపుల్లో టీటీడీ శ్రీవారిసేవ, పరకామణి సేవలను కేటాయిస్తామని చెప్పడంతో పాటు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు కూడా విక్రయిస్తామని పోస్టులు పెడుతుంటాడు. ఒక్కో గ్రూప్‌లో దాదాపు 500 మందికిపైగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ శేషవేణమ్మ తన బృందంతో కలిసి శ్రీవారి సేవ చేసేందుకు టీటీడీ వెబ్‌సైట్‌లో పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో కృష్ణారావు పోస్టులు చూసి అతన్ని సంప్రదించగా, లక్ష్మీ శేషవేణమ్మ బృందంలోని 14 మంది నుంచి రూ.800 చొప్పున రూ.11,200 వసూలు చేశాడు. సేవ చేసేందుకు తిరుమలకు వచ్చిన శేషవేణమ్మ ఈ సేవ ఉచితమేనని తెలుసుకుని విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేయగా, కృష్ణారావును అదుపులోకి తీసుకున్నారు. తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు
Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి