Share News

Trader Threatened: మీ కుటుంబాన్ని బాంబులేసి లేపేస్తాం

ABN , Publish Date - May 08 , 2025 | 04:50 AM

ఆపరేషన్ సిందూర్ విజయ సమయంలో తిరుమల వ్యాపారి త్రిలోక్‌కుమార్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. కుటుంబాన్ని బాంబులేసి హతమారుస్తానంటూ బెదిరించిన ఆగంతకుడికి వ్యాపారి ధైర్యంగా ప్రతిస్పందించారు

Trader Threatened: మీ కుటుంబాన్ని బాంబులేసి లేపేస్తాం

  • పాకిస్థాన్‌ నుంచి తిరుమల వ్యాపారికి బెదిరింపు కాల్‌

  • మేమే 9 చోట్ల బాంబులేశామంటూ వ్యాపారి దీటైన జవాబు

తిరుపతి (నేరవిభాగం), మే 7 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌ విజయంతో దేశమంతా సంబరాలు జరుపుకొంటున్న వేళ.. తిరుమలకు చెందిన వ్యాపారి, జనసేన కార్యకర్త త్రిలోక్‌ కుమార్‌కు పాకిస్థాన్‌ నుంచి బెదిరింపు కాల్‌ వచ్చింది. తాను పాక్‌కు చెందిన అధికారినంటూ చెప్పుకొన్న ఓ ఆగంతకుడు.. వ్యాపారి కుటుంబాన్ని బాంబులేసి లేపేస్తానని బెదిరించాడు. దీనిపై ఆ వ్యాపారి బుధవారం అలిపిరి పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. తిరుపతిలోని ఎన్జీవో కాలనీకి చెందిన త్రిలోక్‌కుమార్‌.. తిరుమలలో గాజుల వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు బుధవారం ఉదయం 10.30 గంటలకు +923292527504 నంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. ‘నీ పేరు త్రిలోక్‌కుమార్‌ కదా..? మీ అబ్బాయి పేరు ఇదేనా..’ అంటూ ఆ వ్యక్తి హిందీలో అడిగాడు.


ఆ తర్వాత కుటుంబ సభ్యుల అందరి పేర్లు చెప్పి.. ‘మీరేం చేస్తున్నారనేది మాకంతా తెలుసు. జాగ్రత్తగా ఉండండి. మీపైన.. మీ ఇంటిపైనా బాంబులు వేసి హతమారుస్తాం. నేను పాకిస్థాన్‌కు చెందిన అధికారిని’ అంటూ బెదిరించాడు. హిందీ తెలిసిన త్రిలోక్‌ కుమార్‌.. ఏమాత్రం భయపడకుండా అతడికి అదేస్థాయిలో బదులిచ్చారు. ‘ఇప్పటికే మా భారత్‌ తొమ్మిది చోట్ల బాంబులు వేసి మిమ్మల్ని హతమార్చింది. మీ పాకిస్థాన్‌ వాళ్లు మా భారతీయులను 28 మందిని చంపితే.. మా సైన్యం ఇప్పటికే 300 మందిని లేపేసింది. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి. మమ్మల్ని అంత తేలిగ్గా తీసుకోవద్దు..’ అంటూ హెచ్చరించారు. ఆ వెంటనే 100కు ఫోన్‌ చేసి బెదిరింపు కాల్‌ సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే వారు కంట్రోల్‌ రూమ్‌ నుంచి అలిపిరి పోలీసులను అప్రమత్తం చేశారు. వివరాలు రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Updated Date - May 08 , 2025 | 01:07 PM