Tirumala: 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:06 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో 16వ తేదీన ఆణివార ఆస్థానం జరగనున్న నేపథ్యంలో 15వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
15, 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో 16వ తేదీన ఆణివార ఆస్థానం జరగనున్న నేపథ్యంలో 15వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(ఆలయ శుద్ధి) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ రెండు ఉత్సవాల నేపథ్యంలో స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 14, 15 తేదీల్లో సిఫారసు లేఖలను తీసుకోబోమని స్పష్టం చేసింది. ఆణివారం ఆస్థానం రోజున ఆలయంలోని బంగారు వాకిలిలో సర్వభూపాల వాహనంలో ఉత్సవమూర్తులను కొలువుదీరుస్తారు. అలాగే మరోపీఠంపై స్వామి సర్వసైనాధ్యక్షుడైన విష్వక్సేనులస్వామి దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు.
పెద్దజీయర్ స్వామి వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్ర్తాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా తీసుకొచ్చి మూలవిరాట్టుకు, మలయప్పస్వామికి, విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ‘పరివట్టం’ (చిన్నపట్టుగుడ్డ) కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామిని ఆశీర్వదిస్తారు. అర్చకులు పెద్ద, చిన్నజీయర్ స్వాములకు, టీటీడీ తరుపున ఈవోకు ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని కుడిచేతికి ఇచ్చి, ‘రూపాయి’ హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేస్తారు. అనంతరం ఈ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల వద్ద ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగుస్తుంది.