Share News

Tirumala Devotees Crowd: తిరుమల కిటకిట

ABN , Publish Date - May 04 , 2025 | 05:06 AM

తిరుమలలో వరుస సెలవులతో భక్తుల రద్దీ తీవ్రమైంది. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుండగా, వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Tirumala Devotees Crowd: తిరుమల కిటకిట

  • వరుస సెలవులతో పెరిగిన రద్దీ

  • సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల, మే 3(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద శనివారం వాహనాలు బారులు తీరాయి. ఇక్కడినుంచి గరుడ విగ్రహం దాకా వాహనాలు నిలచిపోయాయి. వేసవి సెగ ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నడక దారులు కూడా కిటకిటలాడాయి. ఇంత ఎండలోనూ భక్తులు మోకాళ్లమీద మెట్లు ఎక్కుతూ మొక్కులు తీర్చుకున్నారు. సర్వదర్శనానికి 14 గంటలకు పైగానే సమయం పడుతోందని అధికారులు తెలిపారు. స్లాటెడ్‌ టోకెన్లు ఉన్న వారికి కూడా నాలుగు గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులకు తోడు వారాంతపు రోజులు సెలవులు రావడంతో తిరుమలలో ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. గదులు పొందడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. గదులు లభించని భక్తులు యాత్రికుల వసతి సముదాయాలు, జర్మన్‌ షెడ్లు, కార్యాలయాల ముందు సేదదీరుతున్నారు.


వీఐపీ బ్రేక్‌ దర్శన వేళలో మార్పు

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల మార్పు శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఉదయం 6.20 గంటలకే బ్రేక్‌ దర్శనాలు మొదలయ్యాయి. గతంలో ఉదయం 5.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ప్రారంభమై 11 గంటకు ముగిసేవి. అయితే రాత్రి వేళల్లో కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఽఉదయం 5.45 గంటల నుంచే వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించాలని టీటీడీ బోర్డు తీర్మానించింది. దీంతో శనివారం ఉదయం 6.20 గంటలకు బ్రేక్‌ దర్శనాలు మొదలయ్యాయి. 8.30 గంటల వరకు ప్రొటోకాల్‌, రిఫరెల్‌ ప్రొటోకాల్‌, జనరల్‌ బ్రేక్‌ దర్శనాలు జరిగాయి. ఆతర్వాత 10 గంటల వరకు సర్వదర్శన భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరిగి మధ్యాహ్నం 12.20 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలు కొనసాగించి అనంతరం సర్వదర్శన భక్తులను అనుమతించారు. ఈ నూతన విధానంతో అదనంగా గంట సమయం సామాన్య భక్తులకు దక్కినట్టయింది.

Updated Date - May 04 , 2025 | 05:10 AM