Share News

Coastal Andhra Weather: పిడుగులు.. ఈదురుగాలులతో వర్షాలు

ABN , Publish Date - May 16 , 2025 | 05:03 AM

రాష్ట్రంలో పిడుగులు, ఈదురుగాలులతో కలిసి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వడగాడ్పులు, ఉక్కపోత కొనసాగుతున్నాయి.

Coastal Andhra Weather: పిడుగులు.. ఈదురుగాలులతో వర్షాలు

  • మధ్యాహ్నం వరకు వడగాడ్పులు, ఉక్కపోత

  • నేడు పలు జిల్లాల్లో భారీ వానలు

విశాఖపట్నం, అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): ఉత్తర తమిళనాడుకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతం, ఉత్తర కర్ణాటక పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తున్నాయి. వీటన్నింటి ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. కోనసీమ జిల్లా అమలాపురం, ఏలూరు జిల్లా నిడమర్రులో 54, కాకినాడ జిల్లా కాజులూరులో 42, అనకాపల్లి జిల్లా పాతవలసలో 41, కాకినాడ జిల్లా కరపలో 32.2, పిఠాపురంలో 31.7, అల్లూరి జిల్లా దళపతిగూడలో 31.5 మిల్లీమీటర్ల వాన పడింది. కాగా, వాయవ్య భారతం నుంచి వీచే పొడిగాలులతో కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీయడంతో పగటి ఉష్ణోగ్రతలు సాఽధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్యాహ్నం వరకు వడగాడ్పులు, ఉక్కపోత కొనసాగాయి. బాపట్ల జిల్లా ఇంకొల్లులో 42.6, పల్నాడు జిల్లా వినుకొండ, నెల్లూరు జిల్లా దగదర్తిలో 42.5, ఎన్టీఆర్‌ జిల్లా ముచ్చినపల్లిలో 41.9, ప్రకాశం జిల్లా వేమవరంలో 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో ఎక్కువ ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయని పేర్కొంది.


పిడుగులు పడతాయ్‌: విపత్తుల సంస్థ

రాష్ట్రంలో రానున్న రెండు రోజులు 40 డిగ్రీలకుపైఐగా ఉష్ణోగ్రతలతో పాటు ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, పలు జిల్లాల్లో 41-42 ఉష్ణోగ్రతలతోపాటు మన్యం, విజయనగరం జిల్లాల్లోని 10 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది.

Updated Date - May 16 , 2025 | 05:04 AM