Bird flu: కోళ్ల లెక్కలు తేల్చిన ప్రభుత్వం.. బర్డ్ ఫ్లూపై కీలక ప్రకటన
ABN , Publish Date - Feb 12 , 2025 | 08:31 PM
Bird flu: బర్డ్ ప్లూ వల్ల దాదాపు 5 లక్షల కోళ్లు మరణించినట్లు సమాచారం ఉందని ఏపీ పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల మంత్రి కె. అచ్చెన్నాయుడు వివరించారు. కానీ 40 లక్షల కోళ్లు మరణించినట్లు ప్రచారం జరుగుతోందన్నారు.

అమరావతి, ఫిబ్రవరి 12: బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు. చనిపోయిన కోళ్లను.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపగా.. అవి బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయినట్లు నివేదికలో స్పష్టమైందని చెప్పారు. ఈ వ్యాధి వల్ల ఏలూరు జిల్లా బాదంపూడిలో 2 లక్షల కోళ్లు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో 7 వేల కోళ్లు చనిపోయినట్టు సమాచారం ఉందన్నారు.
బుధవారం అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. పౌల్ట్రీలలో ఉన్న గుడ్లను కూడా పూడ్చి వేయించామని చెప్పారు. ఈ బర్డ్ ప్లూ కారణంగా దాదాపు 5 లక్షల కోళ్లు చనిపోయినట్లు సమాచారం ఉందని.. కానీ 40 లక్షల కోళ్లు చనిపోయినట్లు ప్రచారం అయితే జరుగుతోందన్నారు. స్వల్ప ఉష్ణోగ్రతలో ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు.
ఈ బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలోని షాపులను మూసి వేశామన్నారు. ఇక బర్డ్ ఫ్లూ వల్ల ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు ఎంత వేగంగా పెరిగితే అంతే వేగంగా ఈ వ్యాధి తగ్గుతుందన్నారు. పౌల్ట్రీలలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 10 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
మరోవైపు తెలంగాణలో సైతం లక్షలాది కోళ్లు ఈ వ్యాధి వల్ల మరణిస్తున్నాయి. ఇక మార్కెట్‌లో చికెన్ ధరలు సైతం అమాంతంగా పడిపోయాయి. కేజీ చికెన్ ధర రూ. 150గా ఉంది. అయినా చికెన్ కొనుగోలు చేసేందుకు వినియోగ దారులు భయాంందోళనలకు గురవుతోన్నారు.
For AndhraPradesh News And Telugu News