AP High Court : మార్గదర్శి మా పరిధిలో లేదు
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:17 AM
ఏపీ ప్రభుత్వం తన వైఖరి తెలుపుతూ డిపాజిటర్లకు ఇంకా మార్గదర్శి చెల్లించాల్సిన మొత్తం రూ.5.15 కోట్లు ఎస్ర్కో ఖాతాలో ఉన్నాయంది. వాటిని ఇంకా 1,270 మంది డిపాజిటర్లుకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది.
క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగింపుపై మీదే తుది నిర్ణయం
తెలంగాణ హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
ప్రొసీడింగ్స్ కొనసాగించవచ్చు
వైఖరి చెప్పిన తెలంగాణ సర్కారు
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు
హైదరాబాద్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ‘మార్గదర్శి’ కేసుపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈ కేసుపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఏపీ ప్రభుత్వం తన వైఖరి తెలుపుతూ డిపాజిటర్లకు ఇంకా మార్గదర్శి చెల్లించాల్సిన మొత్తం రూ.5.15 కోట్లు ఎస్ర్కో ఖాతాలో ఉన్నాయంది. వాటిని ఇంకా 1,270 మంది డిపాజిటర్లుకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. అందువల్ల ఆ మొత్తాన్ని ఆర్బీఐకిగానీ, రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని నివేదించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పత్రికల్లో బహిరంగ నోటీసు ఇచ్చినప్పటికీ తమకు డబ్బు రావాల్సి ఉందని ఏ డిపాజిటరు ముందుకు రాలేదని గుర్తు చేసింది. ఎస్ర్కో ఖాతాలో 2010 నాటికి రూ.11.69 కోట్లు ఉండగా గత 14 ఏళ్లలో వాటిని డిపాజిటర్లుకు చెల్లిస్తూ వచ్చారని తెలిపింది. ప్రస్తుతం రూ.5.15 కోట్లు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఈ మొత్తాన్ని ఆర్బీఐకి లేదా ప్రభుత్వానికి బదిలీ చేస్తే నిబంధనల ప్రకారం సొమ్ము రావాల్సిన డిపాజిటర్ల వివరాలు నిర్ధారించుకుని చెల్లించవచ్చని తెలిపింది. 2014లో ఉమ్మడి ఏపీ విభజనకు గురైందని, బౌగోళికంగా పరిశీలిస్తే కేసు నమోదైన దిగువ కోర్టు హైదరాబాద్‌లో ఉన్నందున ఈ కేసుతో ఏపీకి సంబంధం ఉండదని తెలిపింది. ఏపీ ప్రభుత్వం సరైన ప్రాసిక్యూటర్ కాదని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కొనసాగించాలా? వద్దా? అని హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఎలాంటి ఆదేశాలు జారీచేసినా కట్టుబడి ఉంటామని పేర్కొంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శికి వ్యతిరేకంగా వైఖరి తీసుకుంది. మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్‌ను మేజిస్ట్రేటు కోర్టు కొట్టేసిందని, ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ వ్యవహారంపై ప్రాసిక్యూషన్ కొనసాగించాలని పేర్కొంది. మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లు జస్టిస్ శ్యాం కోషీ, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావుల ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. గతంలో ఆ సంస్థ తరఫున న్యాయవాదిగా హాజరైనందున విచారణ నుంచి తాను తప్పుకొంటున్నానని జస్టిస్ నర్సింగ్‌రావు తెలిపారు. దీంతో ఈ కేసులు వచ్చేవారం తాత్కాలిక సీజే జస్టిస్ సుజాయ్‌పాల్ ఽనేతృత్వం వహించే ధర్మాసనం ఎదుట లిస్ట్ చేయాలని ధర్మాసనం పేర్కొంది.
For AndhraPradesh News And Telugu News