CM Revanth : కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి
ABN , Publish Date - Mar 04 , 2025 | 06:21 AM
కృష్ణా జలాల్లో తమ రాష్ట్రానికి 70 శాతం వాటా కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే..
గోదావరిలో తెలంగాణకు నికర జలాలెన్ని?
విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచర్ల: రేవంత్‌రెడ్డి
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ
న్యూఢిల్లీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో తమ రాష్ట్రానికి 70 శాతం వాటా కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే.. ఏపీలో కేవలం 30 శాతమే ఉందన్నారు.సోమవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆయన సమావేశమయ్యారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ) పక్షపాత ధోరణితో ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు చేసిందన్నారు. ఏపీ ఈ ఏడాది కూడా కేటాయింపులకు మించిన నీటిని తరలించుకుపోతోందని ఆరోపించారు. దీనిని అడ్డుకోవాలని.. కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై వెంటనే టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందన్నారు. కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), కేఆర్‌ఎంబీల నుంచి ఎటువంటి అనుమతీ పొందలేదని చెప్పారు. తాము పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2022లోనే డీపీఆర్ సమర్పించినా అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని.. న్యాయస్థానాల పరిధిలో ఉన్న కర్ణాటకలోని అప్పర్ భద్రకు మాత్రం అనుమతులు ఇచ్చారని చెప్పారు. సీతారామ ఎత్తిపోతలు, సమ్మక్క సాగర్ బ్యారేజీలకు కూడా అనుమతులు ఇవ్వలేదన్నారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో రాజీపడబోమని తేల్చిచెప్పారు. తమ సాగునీటి ప్రాజెక్టులకు మౌలిక వసతుల అభివృద్ధి కింద 50 ఏళ్లపాటు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వం.. కేంద్రంతో మాట్లాడి తమ ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా ఇప్పించాలన్నారు. సమ్మక్క సాగర్, సీతారామ సహా ఇతర ప్రాజెక్టులకు నికర జల కేటాయింపులే జరగలేదని, అలాంటప్పుడు గోదావరిలో అదనపు నీళ్లున్నాయని, సముద్రంలో కలిసే ఆ నీళ్లను ఉపయోగించుకుంటామని ఆంధ్రప్రదేశ్ చెప్పడం సరికాదన్నారు. గోదావరిపై నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాజెక్టు కట్టుకోవాలనుకుంటోందో దాని డీపీఆర్ ఇవ్వాలని, అప్పుడు చర్చలు జరిపి అభ్యంతరం ఉందో లేదో చెబుతామని తెలిపారు.