Share News

TDP Strong Action: ఎంత తేడా

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:02 AM

చెబ్రోలు కిరణ్‌పై చర్యలతో టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలతో ముందడుగు వేసింది. గతంలో వైసీపీ అసభ్య వ్యాఖ్యలపై చర్యలు లేకపోయిన నేపధ్యంలో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపుతోంది

TDP Strong Action: ఎంత తేడా

నాడు తిట్టినా, దాడి చేసినా నజరానాలు

నేడు సొంత పార్టీ వారైనా గీత దాటితే వేటే

జగన్‌ కుటుంబంపై టీడీపీ కార్యకర్త అసభ్య వ్యాఖ్యలు

24 గంటల్లోనే సస్పెండ్‌ చేసిన టీడీపీ అధిష్ఠానం

కిరణ్‌పై చర్యలకు సర్కారు ఆదేశం.. వెంటనే అరెస్టు

సోషల్‌ సైకోలను వదిలేది లేదనే సంకేతం

అసభ్యకర పోస్టులపై తొలి నుంచీ ఉక్కుపాదమే

నాడు

2021 సెప్టెంబరు 17న చంద్రబాబు ఇంటి వద్ద నాటి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ తన అనుచరులతో కలిసి నానా బీభత్సం సృష్టించారు. కట్‌ చేస్తే.. జోగి రమేశ్‌ను జగన్‌ మంత్రిని చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వంశీని ఆనాడు వెనకేసుకురావడమే కాకుండా, కూటమి ప్రభుత్వం వంశీని అరెస్టు చేస్తే జైలుకు వెళ్లి మరీ వైసీపీ అధినేత పరామర్శించారు.

నేడు

జగన్‌, ఆయన కుటుంబంపై సోషల్‌ మీడియాలో చేబ్రోలు కిరణ్‌ అనే టీడీపీ కార్యకర్త తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే, కిరణ్‌ను 24గంటల్లోపే టీడీపీ సస్పెండ్‌ చేసింది. ఆ వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే సోషల్‌ సైకోల పని పట్టడానికి ప్రత్యేక పోలీస్‌ బృందాల్ని నియమించింది. వైసీపీతోపాటు కూటమి కేడర్‌పైనా ఈ టీమ్‌లు కన్నేసి, అవసరమైతే అరెస్టులూ చేస్తున్నాయి.


(అమరావతి - అంధ్రజ్యోతి)

సోషల్‌ సైకోలు ఏ పార్టీలో ఉన్నా అణచివేయాలన్న సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం ఆచరణలో చేసి చూపించింది. తిడితే పదవులు, తీవ్రంగా దూషిస్తే నజరానాలు, అసభ్యకర పోస్టులు సోషల్‌ మీడియాలో పెడితే ప్రభుత్వంలో చాన్స్‌ ఇస్తూ జగన్‌ ఐదేళ్లూ అరాచక సంస్కృతిని పెంచి పోషించారు. రాష్ట్రంలోని ఈ వాతావరణాన్ని ప్రక్షాళన చేయడానికి ఇప్పటికే పార్టీ, ప్రభుత్వ స్థాయిలో కూటమి చర్యలు తీసుకొంది. ఇందులోభాగంగానే.. ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై టీడీపీ వేటు వేసింది. ప్రముఖులపై వారి కుటుంబ సభ్యులు, మహిళలు, ఆడబిడ్డలు, చిన్నారులపై సోషల్‌ మీడియాలో నీచమైన వ్యాఖ్యలు చేసే సంస్కృతికి కూటమి ప్రభుత్వం తొలి నుంచీ వ్యతిరేకంగా ఉంది. దీనికోసం 2024 నవంబరులో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులతోపాటు టీడీపీ, జనసేన కేడర్‌ పెట్టే పోస్టింగ్‌లపైనా ఈ బృందాలు నిఘా పెట్టాయి. కేసులు పెట్టారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ‘సోషల్‌ మీడియా అబ్యూజ్‌ ప్రొటెక్షన్‌ బిల్లు’ను తీసుకురావాలని యోచిస్తున్నారు. గత నవంబరులో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ బిల్లు విషయం ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది.


అధికారం ఉన్నా...పోయినా అదే తీరు..

ప్రత్యర్థి పార్టీ నేతలపై దాడులకు తెగబడినవారికి.. అసభ్యకరమైన రీతిలో దూషణలు చేసిన వారికి పెద్దపీట వేయడం వైసీపీకి తొలి నుంచీ అలవాటే. 2017లో వైసీపీ ప్లీనరీలో అప్పటి నగరి ఎమ్మెల్యే రోజా ప్రసంగించే సమయంలో సీనియర్‌ వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆమె వద్దకు వచ్చి, అప్పటి సీఎం చంద్రబాబును బాగా తిట్టాలని జగన్‌ చెప్పారని చెబుతున్న వీడియో ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. ప్రత్యర్థులపై అసభ్య పోస్టులు పెట్టేవారికి జీతాలిచ్చి ప్రోత్సహించిన పార్టీ వైసీపీ. 2019లో అధికారంలోకి వచ్చాక విద్వేష రాజకీయాల్లో బాగా దూకుడు పెంచేశారు. చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన కొడాలి నాని, అనిల్‌ యాదవ్‌కు జగన్‌ మంత్రి పదవులిచ్చారు. వైసీపీ హయాంలో వర్రా రవీంద్ర రెడ్డి, ఇప్పాల రవీంద్రరెడ్డి, పంచ్‌ ప్రభాకర్‌, వంటి వారి ద్వారా టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై జుగుప్సాకరరీతిలో పోస్టులు పెట్టించేవారు. చివరికి జగన్‌ సొంత చెల్లెలు షర్మిలను, బాబాయ్‌ కూతురు సునీతను కూడా వదలకుండా వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు అసభ్య పోస్టులు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వహననానికి తెరదీసిందే వైసీపీ. ఆ పార్టీ సోషల్‌ మీడియా సజ్జల భార్గవ్‌రెడ్డి చేతిలోకి వచ్చిన తర్వాత వారికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. చివరికి 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేతలు మాత్రం దూషణల పర్వాన్ని ఆపలేదు.


వారిని వదిలేసి....

చేబ్రోలు కిరణ్‌ విషయంలో టీడీపీ అధిష్ఠానం స్పందించిన తీరుపై టీడీపీ శ్రేణుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. తప్పు ఎవరు చేసినా తప్పేనంటూ అధిష్ఠానం చర్యను సమర్థిస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. కిరణ్‌ కన్నా దారుణంగా పోస్టులు పెట్టే వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులు చాలా మంది ఉన్నారని, వారందరనీ ముందు అరెస్టు చేసి ఆ తర్వాత కిరణ్‌ని అరెస్టు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం

పేదవారి కళ్లలో.. ఆనందం చూశా

For More AP News and Telugu News

Updated Date - Apr 11 , 2025 | 04:02 AM