Share News

TDP Mahanadu: తెలుగు తమ్ముళ్ల మహా వేడుక

ABN , Publish Date - May 27 , 2025 | 04:42 AM

తెలుగుదేశం పార్టీకి విశిష్టమైన మహానాడు 1983లో మొదలైంది. ఎన్నో సంవత్సరాల్లో రాజకీయ కారణాల వల్ల ఆరుసార్లు నిలిపేశారు, కరోనా సమయంలో జూమ్‌ వేదికగా నిర్వహించారు.

TDP Mahanadu: తెలుగు తమ్ముళ్ల మహా వేడుక

  • 1983లో తొలి మహానాడుకు బెజవాడ వేదిక

  • పలు కారణాల వల్ల ఆరుసార్లు బ్రేక్‌

  • కరోనా సమయంలో జూమ్‌ ద్వారా నిర్వహణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నాలుగు దశాబ్దాలుగా తెలుగువాడి ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు. జాతీయ అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కలిసి చేసుకునే సంబరం ఇది. 1982లో టీడీపీ ఆవిర్భవించింది. మహానాడు కార్యక్రమం కూడా అదే ఏడాది నుంచి ప్రారంభమైంది. పార్టీలో మహానాడుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పార్టీ నిర్మాణం, సిద్ధాంతాలు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై అందరూ కలిసి చర్చించి, తీర్మానాలు అమోదించుకోవడం పార్టీ ఆరంభం నుంచి వస్తున్న సంప్రదాయం. పార్టీ భూత, భవిష్యత్తు, వర్తమానాలపై చర్చలకు మహానాడు వేదికగా నిలుస్తుంది. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఇక్కడే జరుగుతుంది.

పలుమార్లు బ్రేక్‌

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతియేటా మహానాడును క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. అయితే 1985, 1991, 1996, 2012, 2019, 2024 సంవత్సరాల్లో మహానాడు జరగలేదు. 1985లో మధ్యంతర ఎన్నికల కారణంగా, 1991లో రాజీవ్‌గాంధీ హత్య తర్వాత దేశంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల కారణంగా, 1996లో 1995 ఆగస్టు సంక్షోభం కారణంగా మహానాడు నిర్వహించలేదు. 2012లో ఎన్నికల కారణంగా జరగలేదు. 2019లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వారంలోపే మహానాడు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణంగా నాయకులు, కార్యకర్తల్లో నెలకొన్న నిరుత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని నాడు కూడా నిర్వహించలేదు. ఇక 2024లో ఎన్నికల కారణంగా నిర్వహించలేకపోయారు.

డిజిటల్‌ వేదికగా నిర్వహణతో రికార్డు

2020, 2021లో కరోనా కారణంగా మహానాడును బహిరంగంగా నిర్వహించలేదు. అయితే 2020లో జూమ్‌ ద్వారా నిర్వహించారు. ఇలా జూమ్‌ ద్వారా పార్టీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించడం టీడీపీతోనే మొదలైంది. సుమారు 14 వేల మందితో ఆన్‌లైన్‌లో భారీ సమావేశాన్ని నిర్వహించిన తొలి రాజకీయ పార్టీ తెలుగుదేశం ఒక్కటే. 2021లోనూ డిజిటల్‌ వేదికపైనే నిర్వహించారు.


2022 మహానాడు ప్రత్యేకత

టీడీపీ ఆవిర్భవించి 2022కి 40 ఏళ్లు పూర్తయింది. ఆ ఏడాది ఒంగోలులో మహానాడు నిర్వహించారు. ఎన్టీఆర్‌ జన్మించి 99 ఏళ్లు పూర్తి కావొస్తుండటంతో ఆయన శతజయంతి ఉత్సవాలనూ ఇక్కడి నుంచే మొదలుపెట్టారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు చంద్రబాబు డిజిటల్‌ సంతకం చేసిన ఆహ్వానపత్రికలను పంపించారు. నాటి వైసీపీ పాలన అణచివేతను ఎదుర్కొని పార్టీలో ఊపునకు ఈ మహానాడు కారణమైంది. కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

2018 నుంచి విదేశాల్లో..

విదేశాల్లో మహానాడును నిర్వహించే సంప్రదాయం 2018లో ప్రారంభమైంది. ఆ ఏడాది ఉత్తర అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన పసుపు పండుగ విదేశాల్లో నిర్వహించిన తొలి మహానాడు. 2022లోనూ అమెరికాలోని బోస్టన్‌లో వైభవంగా నిర్వహించారు.

ఏర్పాటపై మహా కసరత్తు

మహానాడు ఏర్పాట్లు పకడ్బందీగా ఉంటాయి. మంత్రివర్గంలో ఎన్ని శాఖలు ఉంటాయో అన్ని కమిటీలను ఏర్పాటు చేస్తారు. నిర్వహణ, వసతి, వాహనాలకు.. ఇలా ప్రతి పనికీ ఒక కమిటీ ఉంటుంది. సాధారణంగా మహానాడు ఎండాకాలంలో వస్తుంటుంది కాబట్టి ఐదు నిమిషాలకోసారి మజ్జిగ, మంచినీరు అందించే కమిటీ కూడా ఉంటుంది.


పసుపు పండుగకు పేరు వచ్చిందిలా..

మహానాడుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. 1982 మార్చి 29న టీడీపీ ఆవిర్భవించాక పార్టీ జెండా, గుర్తు వంటి అంశాలపై నాయకులతో చర్చించి ఎన్టీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విధివిధానాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీసభ నిర్వహించాలని నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ ఏడాది ఏప్రిల్‌ 11న హైదరాబాద్‌లో నిర్వహించిన సభనే మహానాడు సభగా చెబుతారు. కానీ 1982 మే 28న ఎన్టీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతిలో భారీసభ ఏర్పాటుచేశారు. దీనికి ఎన్టీఆర్‌ ‘మహానాడు’ అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి ‘మహానాడు’ వాడుకలోకి వచ్చింది. అయితే ఈ రెండు సభలు టీడీపీ అధికారంలోకి రాకముందు నిర్వహించినవి. 1983 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత 1983 మే 26, 27, 28 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన మహానాడును అధికారికంగా తొలి మహానాడుగా పరిగణిస్తారు. ఈ కార్యక్రమానికి ఎంజీ రామచంద్రన్‌, బాబూ జగ్జీవన్‌రాం, ఫరూఖ్‌ అబ్దుల్లా, హెచ్‌ఎస్‌ బహుగుణ, చండ్ర రాజేశ్వరరావు, ఎల్‌కే ఆడవాణీ, వాజపేయీ, రామకృష్ణ హెగ్డే, అజిత్‌సింగ్‌, శరద్‌పవార్‌, ఉన్నికృష్ణన్‌, ఎస్‌ఎస్‌ మిశ్రా, రవీంద్ర వర్మ, మేనకా గాంధీ లాంటి బడా నాయకులు వచ్చారు.

మెనూలో ఎన్టీఆర్‌కు ఇష్టమైన వంటలు

మహానాడులో నాయకులు, కార్యకర్తలకు వడ్డించే వంటకాలకూ ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజైన మే 28న ఆయనకు ఇష్టమైన ప్రత్యేక మెనూతో వంటలు చేస్తారు. రవ్వ కేసరి, ఇడ్లీ, కట్టె పొంగలి లేదా చక్కర పొంగలి, మసాలా వడ, చింతపండు దప్పళం, కొత్త మామిడి పచ్చడి, ఉలవచారు, పూతరేకులు, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ చట్నీ వంటివి తప్పనిసరిగా ఉంటాయి.

Updated Date - May 27 , 2025 | 04:43 AM