Share News

TDP Flags Victory: జగన్‌ కోటపై టీడీపీ జెండా

ABN , Publish Date - Aug 15 , 2025 | 05:22 AM

జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన పులివెందుల, ఒంటిమిట్టలో వైసీపీకి ఓటరు దిమ్మతిరిగే తీర్పునిచ్చాడు. జగన్‌ అడ్డా..

TDP Flags Victory: జగన్‌ కోటపై టీడీపీ జెండా

సొంత జిల్లాలో దిమ్మతిరిగే తీర్పు

  • రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ చిత్తు

  • పులివెందులలో వైసీపీ డిపాజిట్‌ గల్లంతు

  • టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,033 ఓట్ల భారీ ఆధిక్యత

  • ఒంటిమిట్టలో వైసీపీ కుదేల్‌

  • దేశం అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి జయకేతనం

కడప, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన పులివెందుల, ఒంటిమిట్టలో వైసీపీకి ఓటరు దిమ్మతిరిగే తీర్పునిచ్చాడు. జగన్‌ అడ్డా పులివెందులలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా రాలేదు. ఒంటిమిట్టలో ఘోర ఓటమిని ఆ పార్టీ మూటగట్టుకుంది. ఈ రెండు చోట్లా తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. సొంత జిల్లాలోనే వైఎస్‌ జగన్‌కు ఈ ఫలితాలు షాక్‌ ఇచ్చాయి. గురువారం జరిగిన బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో తొలినుంచీ టీడీపీ దూసుకెళ్లింది. ప్రతి రౌండ్‌లో దూకుడు ప్రదర్శించింది. ఎమ్మెల్యే జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులలో వైసీపీని చిత్తు చేసింది. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,033 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ జడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,601 ఓట్లు ఉండగా, 7,794 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇందులో లతారెడ్డికి 6,716 ఓట్లు పోల్‌ అయ్యాయి. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. 145 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. నోటాకు 11 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థులు మొయిళ్ల శివకల్యాణ్‌రెడ్డికి 101, సురేశ్‌కుమార్‌రెడ్డికి 4, తుమ్మలూరు అనిల్‌కుమార్‌రెడ్డికి 1, భూమిరెడ్డి రవీంద్రరెడ్డికి 14, గజేంద్రనాథరెడ్డికి 79, భరత్‌రెడ్డికి 35, వెంగల్‌రెడ్డికి 3, సునీల్‌యాదవ్‌కు 2 ఓట్లు వచ్చాయి. శివారెడ్డి అనే అభ్యర్థికి ఒక్క ఓటుకూడా రాలేదు.

,.jpg

ఒంటమిట్టలో అదే దూకుడు

ఒంటిమిట్టలో టీడీపీ విజయ దుందుభి మోగించింది. టీడీపీ అభ్యర్ధి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి... వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిపై 6,267 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 20,467 ఓట్లకు గాను 19,836 ఓట్లు చెల్లాయి. 602 ఓట్లు చెల్లలేదు. 29 ఓట్లు నోటాకు పడ్డాయి. పోల్‌ అయిన ఓట్లలో టీడీపీకి 12,780 రాగా వైసీపీకి 6,513 వచ్చాయి. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు చంద్రకాంత్‌కు 23, వెంకటరమణకు 18, మల్లికార్జునరెడ్డికి 2, శివారెడ్డికి 148, సుధాకర్‌కు 16, మధుమూర్తికి 179, ఈశ్వరయ్యకు 2, వెంకటేశ్‌కు తొమ్మిది ఓట్లు పోల్‌ అయ్యాయి. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను టీడీపీ గెలుచుకోవడంతో ఆ పార్టీలో మంచి జోష్‌ నెలకొంది. కడప, పులివెందుల, ఒంటిమిట్ట, రాజంపేటలలో సంబరాలు చేసుకున్నారు.


గ్రేట్‌.. వుయ్‌ ఆర్‌ సో హ్యాపీ..

లతారెడ్డికి ఫోన్‌లో భువనేశ్వరి అభినందనలు పులివెందుల జడ్పీటీసీ సభ్యురాలిగా పోటీచేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మారెడ్డి లతారెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

భువనేశ్వరి: గ్రేట్‌.. వుయ్‌ ఆర్‌ సో హ్యాపీ.

లతారెడ్డి: థ్యాంక్స్‌ అమ్మా... ఈ విజయానికి కారణం మీరు కూడా..

భువనేశ్వరి: ప్రతి ఒక్కరూ. పులివెందుల అంటేనే జోష్‌. చాలా హ్యాపీగా ఉంది.

లతారెడ్డి: మీరు ఫోన్‌ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.

భువనేశ్వరి: అందరం ఒకే ఫ్యామిలీ. అది టీడీపీ.

లతారెడ్డి: మీ అందరి సహకారంతో గెలుపొందాను. థ్యాంక్స్‌.

Updated Date - Aug 15 , 2025 | 07:39 AM