Share News

AP MLC Elections: ఆంధ్రప్రదేశ్‌లో కూటమికే జేజేలు!

ABN , Publish Date - Mar 04 , 2025 | 03:58 AM

రౌండు రౌండుకూ ఆయన మెజారిటీ పెరుగుతూ.. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ‘రికార్డు గెలుపు’ దిశగా సాగుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల స్థానంలో టీడీపీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్‌ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

AP MLC Elections: ఆంధ్రప్రదేశ్‌లో కూటమికే జేజేలు!

‘కృష్ణా-గుంటూరు’ పట్టభద్రుల స్థానంలో ఆలపాటికి తొలి ప్రాధాన్యంలో భారీ మెజారిటీ గోదావరిలోనూ ఆధిక్యంలో..

ఉత్తరాంధ్రలో పీఆర్టీయూ, ఏపీటీఎఫ్‌ అభ్యర్థులిద్దరికీ టీడీపీ మద్దతు

ఇక్కడ పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులునాయుడు గెలుపు

(అమరావతి/గుంటూరు/ఏలూరు - ఆంధ్రజ్యోతి) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార కూటమి విజయ ఢంకా మోగిస్తోంది. కృష్ణా-గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో ‘కూటమి’ గెలుపు జెండా ఎగురవేయడం ఖాయమైంది. కృష్ణా-గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా అనూహ్య మెజారిటీతో దూసుకెళుతున్నారు. రౌండు రౌండుకూ ఆయన మెజారిటీ పెరుగుతూ.. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ‘రికార్డు గెలుపు’ దిశగా సాగుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల స్థానంలో టీడీపీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్‌ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన, బలమైన అభ్యర్థిగా మరోమారు ‘కృష్ణా-గుంటూరు’ బరిలోకి దిగిన కేఎస్‌ లక్ష్మణరావుకు ఘోర పరాజయం ఎదురవుతోంది. జగన్‌తో అంటకాగడం, వైసీపీ పరోక్ష మద్దతే ఆయన కొంపముంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక... ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానంలో ‘కూటమి’ మద్దతు ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఏపీటీఎఫ్‌ నేత రఘువర్మ రెండోస్థానంలో నిలవగా... వైసీపీ పరోక్ష మద్దతు ప్రకటించిన యూటీఎఫ్‌ అభ్యర్థి విజయగౌరి మూడోస్థానానికి పరిమితమయ్యారు.



ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీగా గాదె విజయం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఆయన రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుపొందారు. గత నెల 27న జరిగిన పోలింగ్‌లో 20,794 ఓట్లు పోలవ్వగా.. అందులో 659 చెల్లనవిగా గుర్తించారు. మిగిలిన 20,135 ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు అదనంగా సాధించిన వారిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అంటే 10,068 ఓట్లు రావాలి. అయితే తొలి ప్రాధాన్య ఓట్లలో శ్రీనివాసులు నాయుడికి 7,210, ఏపీటీఎఫ్‌ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు 6,845, యూటీఎఫ్‌ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరికి 5,804 ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న మిగిలిన ఏడుగురు అభ్యర్థులకు వంద కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించగా.. శ్రీనివాసులునాయుడికి 9,237 ఓట్లు, వర్మకు 8,527 ఓట్లు లభించాయి. ఇంకా శ్రీనివాసులునాయుడి ఎన్నికకు 831ఓట్లు అవసరమయ్యాయి. దీంతో రెండో స్థానంలో నిలిచిన రఘువర్మకు లభించిన ఓట్ల నుంచి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన 10,068 ఓట్లు రావడంతో శ్రీనివాసులునాయుడిని విజేతగా ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. గత నెల 27న జరిగిన పోలింగ్‌లో 2,41,493 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగులో నాలుగు రౌండ్లు ముగిసేటప్పటికి సమీప ప్రత్యర్థి పీడీఎఫ్‌ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావుపై ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 38,491 ఓట్ల ఆధిక్యం సంపాదించారు. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి మెజారిటీ లక్షకుపైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ముందంజలో ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి తొలి రౌండ్‌ పూర్తయ్యేసరికి ఆయన తన సమీప పీడీఎఫ్‌ అభ్యర్థి దిడ్ల రాఘవులుపై 10,705ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. పేరాబత్తులకు 16,520ఓట్లు రాగా.. రాఘవులు5,815ఓట్లు పొందారు. మంగళవారం సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగనుంది.



Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..

Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్

For Telangana News And Telugu News..

Updated Date - Mar 04 , 2025 | 03:58 AM