Audit Department : అవినీతి అధికారికి అందలమా?
ABN , Publish Date - Feb 08 , 2025 | 05:10 AM
విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న అధికారిని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అందలం ఎక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆడిట్ విభాగం డైరెక్టర్‌గా హరిప్రకాశ్‌ను నియమించేందుకు ప్రయత్నాలు.. వైసీపీ హయాంలో తీవ్ర ఆరోపణలు
విచారణ జరుపుతున్న విజిలెన్స్.. రిటైర్మెంట్‌కు ముందు కీలక పదవి?
అమరావతి, ఫిబ్రవరి7(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారులో తీవ్ర ఆరోపణలు వచ్చిన, విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న అధికారిని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అందలం ఎక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలోనే ఆడిట్ విభాగం డైరెక్టర్ పదవి నుంచి తప్పించిన ఈ వివాదాస్పద వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించేందుకు పావులు కదుపుతున్నారు. గతంలో ఎఫ్‌ఏసీ ప్రాతిపదికన స్టేట్ ఆడిట్ శాఖకు ఆర్ హరిప్రకాశ్ డైరెక్టర్‌గా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. వివిధ జిల్లాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించినట్టు విమర్శలు ఉన్నాయి. లంచాలు తీసుకుని పోస్టింగ్‌లు కట్టబెట్టినట్టు ఆరోపణలు రావడంతో గుంటూరులోని విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతోంది. హరిప్రకాశ్‌పై ఆరోపణలు చేసిన వారి నుంచి ఆఽధారాలు కూడా సేకరించింది. విచారణకు సహకరించాలని విజిలెన్స్ అధికారులు ఆయన్ను ఆదేశించారు. మరో నెలలో హరిప్రకాశ్ రిటైర్ కాబోతున్నారు. సాధారణంగా ఇలాంటి సమయంలో అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇవ్వరు. అయితే ఆయనకు ఆడిట్ విభాగం డైరెక్టర్‌గా ఉన్నత స్థాయి పదవి కట్టబెట్టే ప్రయత్నాలపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇందులో కొందరు అధికారుల పాత్ర ఉన్నట్టు సమాచారం. ఆయన నియామకానికి సంబంధించిన ఫైలు ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు అధికారులను పక్కన పెడుతున్న కూటమి ప్రభుత్వం.. హరిప్రకాశ్ నియామకం విషయంలో పునరాలోచించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.