Mining Revenue: సొంత ఆదాయానికే సర్కారు గండి!
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:13 AM
ముఖ్యమంత్రి కూడా విషయం లోతుల్లోకి వెళ్లకుండా, సమస్యను అధ్యయనం చేయకుండా, అధికారులు చెప్పినదానికే తలూపుతున్నారు. అసలు విషయం ఏమిటంటే... గనుల ఆదాయానికి గండి కొట్టింది ప్రభుత్వమే! ఖజానాకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని తెచ్చే సీనరేజీ కలెక్షన్ కాంట్రాక్టులను నాలుగున్నర నెలలపాటు నిలిపివేశారు.
గనుల శాఖలో అసంబద్ధ నిర్ణయంతో గజిబిజి
నాలుగున్నర నెలలు సీనరేజీ కలెక్షన్ నిలిపివేత
కోల్పోయిన ఆదాయం సుమారు 800 కోట్లు
గత ఏడాది నవంబరు నుంచి పునరుద్ధరణ
ఎందుకు ఆపారో... ఆపి ఏం సాధించారో!?
కాంట్రాక్టర్ల బకాయిలుగా చూపిస్తూ
ముఖ్యమంత్రికి గనుల శాఖ నివేదికలు!
సమస్య తెలిసీ పరిష్కరించని ప్రభుత్వం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
గనుల శాఖ ఆదాయానికి గండి కొట్టిందెవరు? 2024-25 ఆర్థిక సంవత్సరంలో గనుల ఆదాయం భారీగా తగ్గిపోవడానికి కారణమేమిటి? ‘సీనరేజి కాంట్రాక్టర్లు భారీగా బకాయి పడ్డారు. అందుకే... ఆదాయం పడిపోయింది’ అని గనుల శాఖ అధికారులు సమాధానం చెబుతున్నారు. ముఖ్యమంత్రి కూడా విషయం లోతుల్లోకి వెళ్లకుండా, సమస్యను అధ్యయనం చేయకుండా, అధికారులు చెప్పినదానికే తలూపుతున్నారు. అసలు విషయం ఏమిటంటే... గనుల ఆదాయానికి గండి కొట్టింది ప్రభుత్వమే! ఖజానాకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని తెచ్చే సీనరేజీ కలెక్షన్ కాంట్రాక్టులను నాలుగున్నర నెలలపాటు నిలిపివేశారు. అదే సమయంలో... సీనరేజీ కాంట్రాక్టు లేని జిల్లాల్లోనూ అన్ని రకాల మినరల్స్‌కు పర్మిట్లు నిలిపివేశారు. సరిగ్గా ఆ నాలుగు నెలల్లోనే సర్కారుకు దాదాపు 800 కోట్ల విలువైన ఆదాయం పోయింది. సీనరేజీ వసూలు కాంట్రాక్టులను నిలిపివేసి ప్రభుత్వం ఏమైనా సాధించిందా? అంటే ఏమీలేదు. దీనివల్ల నష్టపోయింది ప్రభుత్వమే! వాస్తవాలు ఇలా ఉంటే, గనుల శాఖ మాత్రం ఆ నాలుగు నెలల కాలంలో కోల్పోయిన ఆదాయాన్ని కాంట్రాక్టు సంస్థలు చెల్లించాల్సిన బకాయిలుగా చూపిస్తోంది. ఇదెలా సాధ్యం? ‘వసూలు ఆపండి’ అని ఆదేశించింది ప్రభుత్వమే కదా!
అంచనా రూ.2వేల కోట్లు
గత ప్రభుత్వం 2023లో ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన గనుల శాఖలో మైనర్ మినరల్స్ సీనరేజీ కలెక్షన్ కాంట్రాక్ట్‌లు(ఎ్‌ససీసీ) తీసుకొచ్చింది. అంతకుముందు గనుల శాఖనే నేరుగా మైనింగ్ లీజుదారుల నుంచి సీనరేజీ, డెడ్‌రెంట్, కన్సిడరేషన్, ఇతర అనేకరకాల ఫీజులను వసూలుచేసి ప్రభుత్వానికి జమ చేసేది. దీని వల్ల అనేక లీకేజీలు ఉంటున్నాయన్న నిపుణుల సూచనలతో సీనరేజీ కలెక్షన్‌ను ఉమ్మడి జిల్లాల వారీగా ప్రైవేటు సంస్థలకు నాడు అప్పగించారు. తొలుత ఏడు జిల్లాలకు (శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, విజయనగరం, కడప, తూర్పుగోదావరి జిల్లాలు) ఏజెన్సీలను ఎంపిక చేశారు. 2023 నుంచి రెండేళ్ల కాలపరిమితితో ఆ సంస్థలు సీనరేజీ వసూలు చేసి నెలవారీగా ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తున్నాయి. కాగా... విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో గనుల శాఖనే వసూళ్లు చేస్తోంది. ఇటు కాంట్రాక్ట్ జిల్లాలు, అటు గనులశాఖ నియంత్రణలో ఉన్న జిల్లాల్లో ఏటా రూ.2వేల కోట్ల ఆదాయం రావాలి.
కూటమి ప్రభుత్వం వచ్చాక జూన్‌లోనే సీనరేజీ కాంట్రాక్ట్‌లను నిలిపివేశారు. బహుశా... పాత కాంట్రాక్టర్లను మార్చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కావొచ్చు. దీంతోపాటు ఇతర కారణాలతో సీనరేజీ కాంట్రాక్టులను అనధికారికంగా నిలిపివేశారు. పోనీ... వెంటనే కొత్త వాళ్లకు కాంట్రాక్టులు అప్పగించి, వసూళ్లు చేశారా అంటే అదీ లేదు. నాలుగున్నర నెలలపాటు విషయాన్ని నానబెట్టేశారు. గనులశాఖ నియంత్రణలో ఉన్న ఆరు జిల్లాల్లోనూ అన్ని రకాల పర్మిట్లను ఆపారు. దీంతో సర్కారుకు 1,300 కోట్లపైనే నష్టం జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. చివరికి... గత ఏడాది నవంబరు నుంచి తిరిగి సీనరేజీ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించారు. అప్పటికే ఉన్న కంపెనీలనే కొనసాగించారు. ఆపడం ఎందుకు, మళ్లీ వాళ్లనే కొనసాగించడం ఎందుకు? ఈ నాలుగు నెలలు ఎందుకు ఆపారు? ఆపడం వల్ల ఏమైనా కొత్త విషయాలు కనిపెట్టిందా? అంటే ఏమీలేదు.
ఆ సంస్థలపై బకాయి పిడుగు
రూ.800 కోట్లను తాము చెల్లించాల్సిన బకాయిగా చూపడంపై కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాటిని మాఫీ చేయాలని గత కొంతకాలంగా కోరుతున్నాయి. అలాగే, తమ కాంట్రాక్ట్ నిలిపివేసినందుకు అదనంగా మరో నాలుగు నెలల కాలాన్ని పొడిగించాలని కోరుతున్నాయి. వీటిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గనుల శాఖ సర్కారుకు నివేదించాలి. సమస్య ఏమిటో, దానికి మూలాలు ఎక్కడున్నాయో తెలిసినా దీనిపై ప్రభుత్వం స్పందించడంలేదు. గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడం లేదు. నష్టాలు వస్తున్నాయని నివేదికలపై నివేదికలు ఇస్తున్నారేగానీ, వాటికి పరిష్కారమార్గాలు, ప్రత్యామ్నాయాల గురించి గనుల శాఖ సీఎం వద్ద ప్రస్తావించడం లేదు. ఈ విషయంలో మంత్రివర్గస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని సీఎం పలుమార్లు ప్రస్తావించినా, ఆ దిశగా గనుల శాఖ నుంచి ప్రతిపాదనలు తెప్పించుకోలేదు. దీంతో ఐదు నెలలుగా ఈ విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది. ఈలోగానే కంపెనీల కాంట్రాక్ట్ కాలపరిమితి ముగిసిపోతోంది. ఇప్పటికే చిత్తూరు (రాఘవ కన్‌స్ట్రక్షన్స్), అనంతపురం(అమిగోస్) జిల్లాల కాంట్రాక్ట్ కాలపరిమితి ముగిసింది. శ్రీకాకుళం ఈనెల 17, కడప ఈనెల 28, తూర్పుగోదావరి ఏప్రిల్ 14, విజయనగరం జూలై 17, గుంటూరు సెప్టెంబరు 28తో కాంట్రాక్ట్ ముగియనుంది. చిత్తూరు, అనంతపురం జిల్లా ల్లో వసూళ్లను తిరిగి గనుల శాఖ అధికారులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి...
Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..
Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ
Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..
Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..