Justice Chelameswar: బిల్లులపై సుప్రీం తీర్పు ఆదర్శం
ABN , Publish Date - May 17 , 2025 | 04:27 AM
తమిళనాడు బిల్లులపై గవర్నర్ వైఖరిని తప్పుబడుతూ, సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ పరిరక్షణకు మార్గదర్శకమైందని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తెలిపారు. ఎన్నికల సంస్కరణలు జరిగితేనే ప్రజాస్వామ్య భవిష్యత్ బాగుంటుందని, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
వివాదాల సృష్టి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం
ఎన్నికల సంస్కరణల కోసం యువత ఉద్యమించాలి
ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్
తిరుపతి (విద్య), మే 16(ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులకు సమ్మతి తెలపకుండా ఆ రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ వ్యతిరేఖ వైఖరి అవలంబించారని, దానికి అడ్డుకట్ట వేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగిందని మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో ఆయన ‘ఎన్నికల సంస్కరణలు, రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్యం’ తదితర అంశాలపై ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని, ఫెడరల్ స్వభావాన్ని, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాపాడే విషయంలో సుప్రీం తీర్పు ఆదర్శవంతమైందని పేర్కొన్నారు. అలాంటి తీర్పులను స్వాగతించి, రాజ్యాంగబద్దంగా అమలు చేయాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా వివాదాలు సృష్టించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాదని న్యాయ వ్యవస్థపైనే రాష్ట్రపతి ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితులు నేడు దేశంలో ఉన్నాయన్నారు. ఎన్నికల సంస్కరణలు జరగకపోతే దేశానికి ప్రజాస్వామిక భవిష్యత్ ఉండబోదని జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత యువతదే అని, ఎన్నికలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎన్నికల నిర్వహణ ఖర్చులో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేకంగా చట్టం లేనప్పటికీ, 19(1ఏ)లో పొందుపరిచిన స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛగా పరిగణించాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News