Share News

Kanchipuram: కంచిమఠం ఉత్తరాధికారిగా సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి బాధ్యతలు

ABN , Publish Date - May 01 , 2025 | 05:52 AM

కాంచీపురం శంకర మఠంలో సుబ్రహ్మణ్య గణేశ్ శర్మ ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మఠంలో వైభవంగా సన్యాస దీక్ష, నామకరణం, పూజలు నిర్వహించారు.

Kanchipuram: కంచిమఠం ఉత్తరాధికారిగా సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి బాధ్యతలు

పంచగంగ తీర్థంలో సన్యాసాశ్రమ దీక్ష స్వీకరణ

ఆదిశంకరుల సన్నిధి వద్ద నామకరణం చేసిన పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి

చెన్నై/అన్నవరం/అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): తమిళనాడు కాంచీపురంలోని శంకర మఠం ఉత్తరాధికారిగా అన్నవరానికి చెందిన సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రవిడ్‌ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పంచ గంగ తీర్థం మధ్యనున్న మంటపంలో ఆయనకు ప్రస్తుత (70వ) పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి సన్యాస ఆశ్రమ దీక్షను ఇచ్చారు. తొలుత ఉత్తరాధికారికి కాషాయ వస్త్రాలు ధరింపజేసి, దండం, కమండలం అందించి, శంకర మఠానికి చెందిన కొయ్యతో చేసిన పీటపై ఆశీనులను చేశారు. స్ఫటిక రుద్రాక్ష మాలను మెడలో వేశారు. అనంతరం సన్యాస దీక్షను ప్రసాదించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆదిశంకరుల సన్నిధి వద్ద గణేశ శర్మకు ‘శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి’గా నామకరణం చేశారు. ఆ తర్వాత ఆలయం నుంచి వేదపండితుల మంత్రోచ్ఛాటనలు, మంగళవాయిద్యాల మధ్య పీఠాధిపతి, ఉత్తరాధికారి రాజవీధిలో శంకర మఠానికి చేరుకున్నారు. అక్కడ విజయేంద్ర సరస్వతి మంత్రోపదేశం చేసిన తర్వాత కంచిమఠం యువ పీఠాధిపతిగా సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని వివిధ మఠాధిపతులు, సాధువులు, సన్యాసులు కొలనులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పపై నుంచి వీక్షించారు. కాగా, యువపీఠాధిపతి బాధ్యతల స్వీకార మహోత్సవ వేడుకల సందర్భంగా మఠంలో ప్రత్యేక హోమాలు, ఆరాధనలు నిర్వహించారు. యువపీఠాధిపతిని విజయేంద్ర సరస్వతి చేయిపట్టుకుని మఠంలోని మహాపెరియవా (కంచి పరమాచార్యులు), జయేంద్ర సరస్వతి స్వాములవారి బృందావన ప్రాంతానికి తోడ్కొని వెళ్లారు.


కంచిలో పండుగ వాతావరణం

యువపీఠాధిపతి బాధ్యతల స్వీకార మహోత్సవం సందర్భంగా కాంచీపురం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులు, పీఠాధిపతులు, భక్తుల సందడి మంగళవారం నుంచే ప్రారంభమైంది. ఈ వేడుకలను పురస్కరించుకుని కంచి శంకరమఠం, కామాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతటా రంగురంగుల విద్యుద్దీపాలంకరణ, వివిధ రకాల పూలతో, స్వాగత తోరణాలతో అలంకరించారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేఆర్‌ శ్రీరామ్‌, ఏపీ ప్రభుత్వం తరఫున ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌, అన్నవరం దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు, పండితులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇక, కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా సన్యాస దీక్ష స్వీకరించిన అన్నవరం క్షేత్రానికి చెందిన గణేశ శర్మకు సీఎం చంద్రబాబు శుభాభినందనలు తెలిపారు. ఇంతటి పవిత్ర బాధ్యత నెరవేర్చే అవకాశం లభించడం ఆదిశంకరుల అనుగ్రహంగా పేర్కొన్నారు. మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కంచి పీఠానికి ఉత్తరాధికారిగా సన్యాస దీక్ష తీసుకోవడం గర్వకారణమని ట్వీట్‌ చేశారు. గణేశ శర్మ కంచి పీఠానికి ఉత్తరాధికారిగా నియమితులు కావడం ఆనందదాయకమని మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 05:52 AM