Justice Battu Devanand: రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేవారిపై చర్యలు తప్పనిసరి
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:26 AM
భావవ్యక్తీకరణ, వాక్ స్వాతంత్య్రం పేరుతో నోటికి వచ్చినట్లు మాట్లాడి ఇతరుల ఆత్మాభిమానం
లేదంటే ఐదుకోట్లమంది జీవించే హక్కుకు భంగకరం
అభివృద్ధికి కోర్టులూ తమ పరిధిలో సాయమందించాలి
తప్పుచేసినవారు భయపడాలి
నేరస్థుడికి ఊరట దొరికే పరిస్థితి ఉండరాదు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్
ఆయనను సత్కరించిన హైకోర్టు లాయర్ల సంఘం
వాక్ స్వాతంత్య్రం పేరుతో ఇతరుల గౌరవానికి భంగం కలిగించే హక్కు ఏ ఒక్కరికీ లేదు
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): భావవ్యక్తీకరణ, వాక్ స్వాతంత్య్రం పేరుతో నోటికి వచ్చినట్లు మాట్లాడి ఇతరుల ఆత్మాభిమానం, గౌరవానికి భంగం కలిగించే హక్కు ఏ ఒక్కరికీ లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్ అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే న్యాయస్థానాలు శిక్షిస్తాయనే భయం ఉంటే ఎవరూ తప్పు చేయరన్నారు. తప్పు చేసినాసరే న్యాయస్థానానికి వెళ్తే ఉపశమనం లభిస్తుందనే భావన నేరస్థుడిలో కలిగితే అది న్యాయవ్యవస్థకి, ప్రజాస్వామ్యానికి, పౌరుల హక్కులకు గొడ్డలిపెట్టు అన్నారు. ప్రజలు న్యాయవ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. మద్రాసు హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు తిరిగి వచ్చి బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బట్టుదేవానంద్‌ను ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ.... న్యాయం కోరే అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కోర్టులపై ఉందన్నారు. మద్రాసు హైకోర్టు నుండి సొంత రాష్ట్రానికి, సొంత మనుషులు మధ్యకు తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ‘‘తప్పుచేసేవాడు చట్టం అన్నా, కోర్టు అన్నా భయపడాలి. చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని అరాచకాలు, తప్పులు చేసేవాళ్లు న్యాయస్థానాలను అడ్డంపెట్టుకొని ఉపశమనం పొందేలా కోర్టులు వ్యవహరించరాదు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేవారి పై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా, కోర్టులు కఠినంగా వ్యవహరించకపోయినా ఐదుకోట్ల మంది జీవించే హక్కుకు భంగం కలిగించినట్లే అవుతుంది.’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందించేలా పెద్ద ఆస్పతులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే పారిశ్రామికవేత్తలు రావాలని పేర్కొన్నారు. అయితే, తమకు భవిష్యత్తు ఉంటుందని నమ్మకం లేకుండా పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సామాన్యుడికి అభివృద్ధి ఫలాలు అందాలన్నా న్యాయస్థానాలు కూడా రాజ్యాంగపరంగా, చట్టపరంగా వాటికి ఉన్న అధికారాలతో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. న్యాయవాదులు సమాజంపట్ల తమ గురుతర బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎ్‌సజీ) చల్లా ధనంజయ, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, సీనియర్ న్యాయవాదులు కేఎస్ మూర్తి, పి.వేణుగోపాలరావు పాల్గొని ప్రసంగించారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News