Share News

Rayapati Shailaja: గ్రామీణ మహిళలకు చట్టాలపై అవగాహన

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:44 AM

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ గ్రామీణ మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, హక్కుల గురించి పాఠశాలలు, కళాశాలల్లో సదస్సులు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

Rayapati Shailaja: గ్రామీణ మహిళలకు చట్టాలపై అవగాహన

ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ: రాయపాటి శైలజ

అమరావతి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ తెలిపారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా అవగాహన పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘బాధితులతో మాట్లాడి అండగా నిలుస్తున్నాం. నిందితులకు శిక్షపడేలా చేస్తున్నాం. మహిళలపై అత్యాచారాలు, ఘోరాలు జరగకుండా అధికారులతో సమీక్షిస్తున్నాం. ఏ ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కమిషన్‌ చూస్తూ ఊరుకోదనే ధైర్యం మహిళలకు కలిగేలా కృషి చేస్తున్నాం. బాధిత మహిళలకు తక్షణ సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. చట్టపరంగా మహిళల రక్షణకు ఉన్న హక్కుల అమలుకు కమిషన్‌ ఎప్పుడూ ముందుంటుంది. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం నుంచి దర్యాప్తు అధికారులు చర్యలు తీసుకునే వరకు పర్యవేక్షణ లోపం లేకుండా పని చేస్తుంది. ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టం, పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పీవోఎ్‌సహెచ్‌), గృహ హింస (డీవీ) చట్టం వంటివాటిపై గ్రామాల్లోని యువతకు, కార్మిక మహిళలకు అవగాహన కల్పిస్తాం. స్కూళ్లు, కళాశాలల్లో బాలికలకు చట్టాలు, న్యాయం పట్ల అవగాహన సదస్సులు నిర్వహించేందుకూ ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మునుపెన్నడూ చూడని విధంగా సమర్థ మహిళా కమిషన్‌ను ప్రజలకు సరికొత్త రీతిలో పరిచయం చేస్తాం. మహిళలకు భరోసా ఇస్తాం. బాధితులకు అండగా నిలుస్తాం. మహిళల హక్కుల రక్షణ, సంక్షేమం కోసం పనిచేసే కమిషన్‌ రాజకీయ ఒత్తిళ్లకు లోనవకుండా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని శైలజ పేర్కొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 05:46 AM