Share News

Space Cities: లేపాక్షి, తిరుపతిలో స్పేస్‌ సిటీలు

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:21 AM

రాష్ట్రంలోని లేపాక్షి, తిరుపతిల్లో అంతరిక్ష నగరాలు స్పేస్‌ సిటీలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉండవల్లి నివాసంలో స్పేస్‌ సిటీ పాలసీ-2025-35పై సమీక్ష జరిగింది.

Space Cities: లేపాక్షి, తిరుపతిలో స్పేస్‌ సిటీలు

  • 8 ఏళ్లలో 25 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యం: సీఎం

అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని లేపాక్షి, తిరుపతిల్లో అంతరిక్ష నగరాలు (స్పేస్‌ సిటీలు) నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉండవల్లి నివాసంలో స్పేస్‌ సిటీ పాలసీ-2025-35పై సమీక్ష జరిగింది. పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌, ఆ శాఖ కార్యదర్శి యువరాజ్‌, సీఎంవో కార్యదర్శి కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీకి లేపాక్షి, తయారీ రంగానికి తిరుపతి ప్రత్యేకంగా ఉండాలని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్పేస్‌ సిటీ రంగంలో 2033నాటికి రూ.25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో 4.0 పాలసీని రూపొందించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. 35 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కేలా విధానం ఉండాలన్నారు.


‘కమ్యూనికేషన్‌ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థలను పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలి. ముందుకొచ్చే సంస్థలకు 25 నుంచి 45 శాతం దాకా పెట్టుబడి రాయితీ ఇచ్చేలా పాలసీలో ప్రతిపాదించాలి. రూ.కోటి నుంచి రెండున్నర కోట్ల దాకా మైక్రో పెట్టుబడులుగా, రూ.2.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల దాకా చిన్నతరహా, రూ.25 కోట్ల నుంచి రూ.125 కోట్ల దాకా మధ్య తరహా, రూ.125 కోట్ల నుంచి రూ.500 కోట్ల దాకా భారీ పెట్టుబడులుగా ప్రకటించాలి. రూ.500 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెడితే మెగా పరిశ్రమగా పరిగణించాలి. ఈ రంగంలోనూ మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. అంతరిక్ష యానంపై అవగాహన కలిగించేందుకు వీలుగా విద్యార్థులనూ భాగస్వాములను చేసేలా కార్యాచరణను సిద్ధం చేయాలి.


పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీకి రూపకల్పన చేయాలి. శాస్త్ర సాంకేతిక రంగంలో ఆసక్తి కలిగిన విద్యార్థులను, ప్రత్యేక బోధన చేసే విద్యాసంస్థలను కూడా భాగస్వాములను చేస్తే స్పేస్‌ సిటీ ముఖ్య ఉద్దేశాలు, ప్రభుత్వ ఆలోచనలు ప్రజలకు తెలుస్తాయి’ అని స్పష్టం చేశారు. భవిష్యత్‌ అంతరిక్ష రంగానిదేనని రాష్ట్ర స్పేస్‌ టెక్నాలజీ గౌరవ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు. సమీక్షలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన పాల్గొన్నారు. స్పేస్‌ విజన్‌ పాలసీ-2047 కింద కేంద్రం కీలక ప్రాజెక్టులు చేపడుతోందని, స్టార్‌ లింక్‌, స్పేస్‌ఎక్స్‌, బ్లూ ఆరిజన్‌ వంటి ప్రైవేటు ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని వెల్లడించారు. కాగా.. విజన్‌-2047 కింద ఉపగ్రహాల తయారీ, రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల ప్రయోగం, చంద్రయాన్‌-4, వీనస్‌ ఆర్బిటరీ మిషన్‌, మార్స్‌ ల్యాండర్‌ మిషన్‌, హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లయిట్‌, స్పేస్‌ స్టేషన్‌, నెక్స్ట్‌ జనరేషన్‌ లాంచ్‌ వెహికల్‌, శ్రీహరికోటలో మూడో లాంచ్‌ ప్యాడ్‌ నిర్మాణం వంటివి లక్ష్యాలుగా నిర్దేశించుకోవాలని సమావేశం నిర్ణయించింది.

Updated Date - Jun 27 , 2025 | 04:21 AM