AP Weather: 13న దక్షిణ అండమాన్‌కు నైరుతి
ABN , Publish Date - May 07 , 2025 | 04:24 AM
ఈ నెల 13న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ను తాకనున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు, మరికొన్నింట్లో ఉక్కపోతతో కూడిన ఎండలు నమోదయ్యాయి
ఈ ఏడాది వారం ముందే రాక.. నేడూ పలు జిల్లాల్లో వర్షాలు
విశాఖపట్నం, అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ఈ నెల 13వ తేదీన దక్షిణ అండమాన్, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణంగా మే 20 తర్వాత అండమాన్‌కు నైరుతి రావాల్సి ఉంది. అయితే, ఈ ఏడాది వారం ముందే దక్షిణ అండమాన్‌ను తాకేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడినట్టు ఐఎండీ పేర్కొంది. కాగా, కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మంగళవారం ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా వినాయకపురంలో 40.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగాయి. అలాగే చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 42.4, తిరుపతి జిల్లా రేణిగుంట, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 42.1, కడప జిల్లా ఒంటిమిట్లలో 41.3, కర్నూలు జిల్లా కామవరంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం కొన్ని ప్రాంతాల్లో 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఎండ ప్రభావం, మరికొన్ని పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి జిల్లా చింతూరు, గంగవరం మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.