Somireddy on Jagan: తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో జగన్ ఉన్నారు: సోమిరెడ్డి
ABN , Publish Date - Oct 05 , 2025 | 05:20 PM
ప్రజలు పాలించమని అధికారం అప్పగిస్తే కల్తీ మద్యంతో హోల్ సేల్ వ్యాపారం చేసిన పెద్దమనిషి జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రమాదకర మద్యంతో అమాయకుల ప్రాణాలు తీసి..
అమరావతి, అక్టోబర్ 5: ప్రజలు అధికారం అప్పగిస్తే కల్తీ మద్యంతో హోల్ సేల్ వ్యాపారం చేసిన పెద్దమనిషి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రమాదకర మద్యంతో అమాయకుల ప్రాణాలు తీసిన వారిని పదవులిచ్చి ప్రోత్సహించిన చరిత్ర ఆయనదని జగన్ ను విమర్శించారు. వారి అక్రమాలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని సోమిరెడ్డి తేల్చిచెప్పారు.
సమర్ధంగా పని చేసి మద్యం డంప్ ను పట్టుకున్న వారిని అభినందించాల్సిదిపోయి.. విమర్శలా? అంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ ను ప్రశ్నించారు సోమిరెడ్డి. 'మద్యం గురించి జగన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం కేంద్రంపై ఎక్సైజ్ శాఖ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. కల్తీ మద్యం రాష్ట్రమంతా జరుగుతోందని, సీఎం చంద్రబాబు నాయుడే ప్రోత్సహిస్తున్నారని జగన్ రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు.
అక్రమాలను మా కూటమి ప్రభుత్వం సహించే పరిస్థితే లేదు. రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న కల్తీ మద్యం కేంద్రాన్ని సీజ్ చేయడంతోపాటు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రభుత్వం, అధికారులు సమర్ధవంతంగా పనిచేసినందుకు అభినందించాల్సిందిపోయి నిందలు వేస్తారా?' అంటూ జగన్ ను సోమిరెడ్డి నిలదీశారు.
'వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జగన్ రెడ్డి సారథ్యంలోనే హోల్ సేల్ గా కల్తీ మద్యం వ్యాపారం జరిగింది. బలవంతంగా గుంజుకున్న డిస్టలరీల్లో కల్తీ మద్యం తయారు చేసి ప్రభుత్వ డిపోలు, మద్యం దుకాణాల ద్వారా జనం నెత్తిన పోశారు. ఆ కల్తీ మద్యం తాగి వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు. డిస్టలరీలను జగన్ రెడ్డి లెఫ్ట్, రైట్లు బలవంతంగా సొంతం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల కుంభకోణం దేశంలోనే ఒక సంచలనం. ఓట్లు వేసి అధికారం ఇచ్చిన ప్రజలకు కల్తీ మద్యం పోసి చంపిన పార్టీగా వైసీపీ చరిత్రలో నిలిచిపోతుంది. ఇన్ని పాపాలు చేసిన జగన్ రెడ్డి ఈ రోజు నీతులు వల్లించడం విచిత్రంగా ఉంది. చర్యలు చేపడితే విమర్శిస్తారు.. చర్యలు చేపట్టకపోయినా విమర్శలు చేస్తారు.. ఇదీ జగన్ రెడ్డి నైజం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోకుండా ఉండదు. తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లోనే జగన్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.
కల్తీ మద్యం కుట్రదారులను ప్రోత్సహించిన చరిత్ర జగన్ రెడ్డిది. 2014లో గవర్నర్ పాలన సాగుతున్న సమయంలో సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు కల్తీమద్యంతో అమాయకులను చంపేశారు. కరడుగట్టిన మాఫియాతో కలిసి ప్రమాదకరమైన కల్తీ మద్యాన్ని రెండు నియోజకవర్గాల్లో భారీఎత్తున డంప్ చేశారు. గోవాతో పాటు పాండిచేరి, కర్ణాటక నుంచి ప్రమాదకరమైన కల్తీ మద్యాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధికారులు 14 డంప్ లను గుర్తించి కేసులు నమోదు చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 4, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై 6 కేసులు నమోదయ్యాయి. సర్వేపల్లిలో ఐదుగురు, కావలిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.. వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కల్తీ మద్యం పోసి అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోకపోగా పదవులు ఇచ్చి ప్రోత్సహించిన చరిత్ర జగన్ రెడ్డిది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అవినీతిని, మద్యం మాఫియాను ప్రోత్సహించి, కల్తీ మద్యంతో హోల్ సేల్ వ్యాపారం చేసిన జగన్ రెడ్డికి మాట్లాడే హక్కే లేదు' అని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News