YSRCP Era TDR Bond Scam: బాండ్లపై బండ
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:21 AM
వైసీపీ హయాంలో పలు వివాదాలు.. చిత్రవిచిత్ర నిర్ణయాలకు కేంద్రంగా నిలిచిన టీడీఆర్ బాండ్ల స్కామ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కామ్‌పై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది...
వైసీపీ హయాంలో అడ్డగోలుగా జారీ
వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కామ్
నత్తనడకన సాగుతున్న విచారణ
నకిలీలు, దళారులకే అప్పట్లో అత్యధిక లబ్ధి
రూ.కోట్లు జేబులో వేసుకున్న వైసీపీ నాయకులు
కూటమి రాగానే విజిలెన్స్ విచారణకు నిర్ణయం
‘దొంగలు దొరికినా’ ఇంతవరకు చర్యల్లేవు!
ఒక్క తిరుపతిలోనే రూ.4 వేల కోట్ల కుంభకోణం!
కాకినాడ, తణుకులోనూ భారీగా అక్రమాలు
గుంటూరులో బాధిత రైతుల గగ్గోలు
మంత్రి నారాయణ ప్రకటనతో మళ్లీ తెరపైకి వివాదం
(ఆంధ్రజ్యోతి- న్యూస్ నెట్‌వర్క్): వైసీపీ హయాంలో పలు వివాదాలు.. చిత్రవిచిత్ర నిర్ణయాలకు కేంద్రంగా నిలిచిన టీడీఆర్ బాండ్ల స్కామ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కామ్‌పై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. శాఖాపరమైన విచారణను జరిపించాలని ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో రూ.వందల కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ అయ్యాయి. వీటి లబ్ధిదారుల్లో నకిలీలు, దళారులే అత్యధికమని కూటమి ప్రభుత్వం గుర్తించింది. అయితే, అక్రమాలను నిగ్గుతేల్చేపనిని విజిలెన్స్ ఆశించినంత వేగంగా చేపట్టడం లేదనే అభిప్రాయం ఉంది. మరోవైపు, ఇద్దరు మంత్రులు టీడీఆర్ బాండ్లపై భిన్నంగా చేసిన ప్రకటనలు ఈ వ్యవహారాన్ని మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. టీడీఆర్ బాండ్ల (ట్రాన్స్‌ఫరబుల్ డెవల్‌పమెంట్ రైట్స్) అవకతవకలపై విచారణ లోతుగా జరుగుతోందని తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలపగా, టీడీఆర్‌కు సంబంధించి తిరుపతిలో పెద్దగా అవినీతి జరగలేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. టీడీఆర్ బాండ్లను ఈ శాఖే జారీచేస్తుంది. అయితే, నారాయణ వ్యాఖ్యలను అవకాశంగా తీసుకుని ఐఏఎస్ శ్రీలక్ష్మిపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లోనూ అప్పట్లో భారీగా బాండ్ల దోపిడీ కొనసాగింది. గుంటూరు శివార్లలో రెండున్నర కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణను వైసీపీ హయాంలో చేపట్టారు. కానీ, ఈ భూములకు కమర్షియల్‌కు సంబంధించిన డోర్ నంబర్ వేసి ఆస్తి రేట్లు పెంచేసి.. టీడీఆర్ బాండ్లను అధికారులు జారీచేశారు. వాటిని పొందినవారినుంచి ఆ తర్వాత భారీగా కమీషన్లు పుచ్చుకున్నారు. రోడ్లు భవనాల శాఖ విశ్రాంత ఇంజనీర్‌ను మధ్యవర్తిగా పెట్టుకుని అధికారులు, నేతలు ఈ తతంగం నడిపించారు. సుమారు రూ.100 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. విషయం బయటకుపొక్కడంతో అప్పట్లోనే ఈ ప్రక్రియను నిలిపివేశారు. అప్పటికే డబ్బులు ఇచ్చుకున్న నిజమైన లబ్ధిదారులు మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మునిసిపాలిటీ పరిధిలో 28 ఎకరాలు పురపాలక శాఖ సేకరించేలా అప్పట్లో అధికారులపై వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అందుకోసం రూ.900 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేయించారు. ఈ భూమికి గజాల లెక్కన బాండ్లు జారీ చేయగా, ఆయా భూముల యజమానులకు బదులు మధ్యదళారులు ఈ లబ్ధిని పొందారు. ఈ వ్యవహారంలో అప్పటి జిల్లా మంత్రికి రూ.కోట్ల ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా అప్పట్లో టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. అయితే, ఈ ప్రక్రియలో రూ.కోట్లలో అవినీతి చోటుచేసుకున్నదని ఆనాడే ఆరోపణలు వచ్చాయి. కాకినాడ కార్పొరేషన్‌లో గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన రూ.411కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ల గుట్టు రట్టయినా చర్యలు లేవు. పరిశ్రమల అవసరాల కోసం కాకినాడ సమీపంలోని దుమ్ములపేటలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. దీనికి అవసరమయ్యే స్థలం చాలా తక్కువ. పైగా ఈ స్థలాన్ని ట్రాన్స్‌కో స్వయంగా సమ కూర్చుకోవాలి. కానీ, కార్పొరేషన్‌ను తెరపైకి తెచ్చి ఓ ప్రైవేటు వ్యక్తి నుంచి నాలుగున్నర ఎకరాలు కొనిపించారు. సుమారు రూ.251కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను జారీ చేసేశారు. కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని పార్కు స్థలం వ్యవహారంలో మరో రూ. సుమారు 160 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీచేశారు.
టీడీఆర్ బాండ్ అంటే....
పట్టణాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణక్రమంలో పురపాలక శాఖ మున్సిపల్‌శాఖ ట్రాన్సఫరబుల్ డెవల్‌పమెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లను జారీ చేస్తుంది. భూమి సేకరించే ప్రాంతంలో మార్కెటు రేటు ఎంత ఉంటుందో దాని కంటే ఎక్కువ విలువ కలిగిన బాండ్లను స్థలం కోల్పోయిన యజమానులకు కేటాయిస్తారు. ముఖ్యంగా రోడ్ల విస్తరణ, పార్కుల అభివృద్ధి, కంపోస్టు యార్డ్‌కు సంబంధించి స్థలాలను సేకరించేందుకు పురపాలక శాఖ ఈ బాండ్లను జారీచేస్తుంది. ఎవరికైనా ఈ బాండ్లను విక్రయించుకునే వెసులుబాటును కల్పిస్తుంది.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..