job opportunities: ఉద్యోగాలే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:41 AM
రాష్ట్ర యువత కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టే అంశంపై అధ్యయనం చేయాలన్నారు.
కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఉన్నత విద్య
ప్రతి నియోజకవర్గంలో 1500 ఉద్యోగాలు లక్ష్యం
ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ వర్సిటీ ఏర్పాటు
నైపుణ్యాభివృద్ధిపై సమీక్షలో సీఎం చంద్రబాబు
క్లస్టర్ల వారీగా నైపుణ్య శిక్షణ: మంత్రి లోకేశ్
అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర యువత కోసం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై మంగళవారం సమీక్ష నిర్వహించా రు. ఏఐని వినియోగించి రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఉద్యోగావకాశాలు ఎక్కడున్నా గుర్తించి నైపుణ్యం వెబ్‌సైట్‌లో ఉంచాలన్నారు. నైపుణ్యం పోర్టల్‌లో అందరినీ నమోదు చేయించాలన్నా రు. యువత పోర్టల్‌లో నమోదుచేసుకోగానే వెంటనే వారి రెజ్యూమ్ తయారయ్యేలా డిజైన్ చేయాలన్నారు. రాష్ట్రంలో రూ.9.5 లక్షల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని, తద్వారా 8.5 లక్షల ఉద్యోగాలొస్తాయని తెలిపారు.
ఐటీ కోర్సులు చేసిన యువత నైపుణ్యాలను అంచనా వేయాలన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నైపుణ్య గణన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికకు అనుగుణంగా యువతకు నైపుణ్యాలు కల్పించాలని సీఎం సూచించారు. 6వ తరగతి నుంచి పీజీ వరకూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పించాలన్నారు. విద్యా సంస్థల తో పరిశ్రమలను అనుసంధానం చేసి నైపుణ్య శిక్షణపై కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆధార్, అపార్ ఐడీలతో అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌ను అనుసంధానం చేయాలన్నారు.
74 వేల మందికి ఉద్యోగాలు
175 నియోజకవర్గాల్లో 1,164 జాబ్ మేళాలు నిర్వహించగా, వాటి ద్వారా 61,991 మందికి ఉద్యోగాలు లభించాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన 74,834 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. క్లస్టర్ల వారీగా నైపుణ్య శిక్షణ చేపడుతున్నట్లు వివరించారు. 5 క్లస్టర్లలో నైపుణ్యాభివృద్ధి కల్పిస్తామన్నారు. శిక్షణ, ఉద్యోగాల కల్పనలో టోనీ బ్లెయిర్ సంస్థతో కూడా ఏపీ పనిచేస్తోందన్నారు. సీఎం మాట్లాడుతూ.. ఈ సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 1,500 ఉద్యోగాలు కల్పించేలా జాబ్‌మేళాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అన్ని పరిశ్రమలు అప్రెంటి్‌సషిప్ విధానాన్ని అమలుచేయాలన్నారు. నైపుణ్య శిక్షణ గురించి గ్రామీణ యువతకు తెలిసేలా కోర్సుల గురించి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జర్మనీ, యూరప్, ఇటలీ, సింగపూర్, ఇతర దేశాల్లో వైద్య ఆరోగ్యం, నిర్మాణరంగం, పర్యాటకం, ఐటీ, లాజిస్టిక్స్, ఉత్పత్తి రంగాల్లో విస్తృతమైన అవకాశాలను దక్కించుకునేందుకు విదేశీ భాషా నైపుణ్యాలను యువతలో పెంచాలన్నారు.