Bholebaba Dairy Scam: భోలేబాబా డెయిరీ చుట్టూనే దర్యాప్తు
ABN , Publish Date - May 18 , 2025 | 04:01 AM
టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి వ్యవహారం ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీ చుట్టూ తిరుగుతోంది. నెయ్యిలో పామాయిల్‌తో పాటు 12 రకాల రసాయనాలు కలిపి కల్తీ తయారైనట్లు తేలింది.

పాల సేకరణా లేదు.. పాల ఉత్పత్తుల విక్రయాలూ లేవు
కల్తీ నెయ్యి మొత్తం తయారైంది అక్కడే
ఇతర డెయిరీల ద్వారా టీటీడీకి సరఫరా
(తిరుపతి-ఆంధ్రజ్యోతి)
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరాపై నమోదైన కేసు దర్యాప్తు మొత్తం ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీ చుట్టూనే తిరుగుతోంది. ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ ద్వారా భోలేబాబా డెయిరీయే టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. భోలేబాబా డెయిరీలో పాల సేకరణ గానీ, పాల ఉత్పత్తుల విక్రయాలూ గానీ చేయడం లేదని దర్యాప్తులో వెలుగు చూసింది. స్థానికంగా స్వల్ప పరిమాణంలో నెయ్యి కొనుగోలు చేసి దానికి అధిక పరిమాణంలో పామాయిల్, రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేసినట్టు వెల్లడైంది. ఈ వ్యవహారంలో ఆ డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్, జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణా, వారికి పామాయిల్ సరఫరా చేసిన ఆశిష్ అగర్వాల్‌లదే కీలక పాత్రగా సిట్ తేల్చింది. ఇప్పటి వరకూ ఈ కేసులో 12మంది వ్యక్తులను, మూడు డెయిరీ సంస్థలను నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన అధికారులు కేసు విచారణను నెల్లూరు ఏసీబీ కోర్టుకు బదిలీ చేసుకున్న సంగతి తెలిసిందే. నిందితుల్లో ఇద్దరు టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. ఏ9, ఏ10 ఉన్న ఆ ఇద్దరూ టెండర్ల వ్యవహారంలో సంబంధిత డెయిరీల నుంచి లబ్ధి పొందారని సిట్ గుర్తించడంతో వీరిని అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్లే కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేసినట్టు వెల్లడైంది.
పామాయిల్, 12 రకాల రసాయనాలతో కల్తీ..
ఉత్తరాఖండ్‌లోని భగవాన్‌పూర్‌లో మెస్సర్స్ భోలేబాబా డెయిరీ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట డెయిరీ ప్లాంట్ ఉంది. దీని అనుబంధ సంస్థ హర్ష్ ఫ్రెష్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. మెస్సర్స్ బజ్‌బజ్ ఆయిల్ రిఫైనరీ నుంచీ పామాయిల్ సేకరించేదని, ఆ పామాయిల్‌ను భోలేబాబా డెయిరీ తెప్పించుకుని నెయ్యి కల్తీ తయారీకి వాడినట్టు సిట్ గుర్తించింది. నెయ్యిలో పామాయిల్, మరో 12 రకాల రసాయనాలు కలిపి కల్తీచేసినట్టు గుర్తించారు. నెయ్యి కల్తీలో ప్లాంట్ ఆపరేటర్ సంజయ్ చౌహాన్ పాత్ర కీలకమని తేలింది. నెయ్యి నమూనాలను ఢిల్లీలోని ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ల్యాబ్‌కు పంపగా 90 శాతానికి పైగా కల్తీ ఉన్నట్టు నిర్ధారించినట్టు సమాచారం.
కల్తీ బయటపడకుండా జాగ్రత్తలు..
ల్యాబ్‌లో పరీక్షించినా కల్తీని గుర్తించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నట్టు సిట్ గుర్తించింది. ల్యాబ్ టెస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా వాల్యూస్ ఉండేలా, నెయ్యి వాసన వచ్చేలా అవసరమైన రసాయనాలను కలిపేవారని తేల్చింది. కల్తీ నెయ్యిని భోలేబాబా డెయిరీలోనే నిల్వ ఉంచి, అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా తిరుపతి జిల్లాలోని వైష్ణవి డెయిరీకి పంపినట్టు గుర్తించింది.
ఖాళీ లారీలతోనే మోసం..
రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా తదితర ప్రాంతాల నుంచి భోలేబాబా డెయిరీకి ఖాళీ లారీలు వచ్చేవని కొందరు ఉద్యోగులు సిట్‌కు తెలిపారు. ఐదారు గంటలు వాటిని అక్కడే ఉంచి ఆ తర్వాత తీసుకెళ్లేవారని చెప్పారు. ఆ లారీల డ్రైవర్లు నెయ్యి తీసుకొచ్చినట్టుగా ప్లాంటులోకి వెళ్లి జీఎం హరిమోహన్ రాణాకు లేదా అకౌంటెంట్ ఆశిష్ రోహిలాకు అందజేసేవారని తెలిపారు. పొమిల్ జైన్, విపిన్ జైన్, హరిమోహన్ రాణా, ఆశిష్ రోహిలా నెయ్యి సరఫరా జరిగినట్టుగా ఇన్‌వాయి్‌సలు, ఇ-వే బిల్లులు, ట్రాన్స్‌పోర్టు రశీదులు, జీఎస్టీ రిటర్నులు సృష్టించి, వాటిని అడ్డుపెట్టుకుని బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిపినట్టు సిట్ గుర్తించింది.
నలుగురు నిందితులదే కీలకపాత్ర
ఈ కేసులో ప్రధానంగా నలుగురు నిందితులదే కీలక పాత్రని సిట్ భావిస్తోంది. భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ ప్రధాన సూత్రధారులు కాగా వారిద్దరికీ ఆ డెయిరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణా కీలకంగా సహకరించారు. ఈ ముగ్గురికీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సహకరించిన కీలక వ్యక్తి ఆశిష్ అగర్వాల్‌గా సిట్ తేల్చింది. రాజస్థాన్ రాష్ట్రం బికనీర్‌లోని మోహన్ లాల్ ఆశిష్ కుమార్ సంస్థకు ఆయన యజమాని. బికనీర్‌లోనే అగర్వాల్ అండ్ సన్స్ సంస్థకు ఆయన తల్లి సీతా అగర్వాల్ యజమాని అయినప్పటికీ ఆ సంస్థ నిర్వహణ కూడా ఆశిష్ చూస్తున్నారు. హరియాణాలోని కురుక్షేత్ర సాహాబాద్‌లో సుప్రీం ఇన్‌కార్పొరేషన్, ఢిల్లీ కమల్ రోడ్డులో సుప్రీం సంస్థలను కూడా ఈయనే నిర్వహిస్తున్నారు. పొమిల్ జైన్, విపిన్ జైన్, హరిమోహన్ రాణాకు సంపూర్ణంగా సహకరించి అక్రమాలకు పాల్పడినట్టు సిట్ గుర్తించింది. ఆశిష్ అగర్వాల్ తన సంస్థల నుంచి భోలేబాబా డెయిరీకి నెయ్యి సరఫరా చేయకుండానే చేసినట్టు బోగస్ రికార్డులు సృష్టించినట్టు గుర్తించింది. ఆ డెయిరీ నుంచి ఏకంగా రూ. 146కోట్లు అందుకున్నారని తేలింది. ఆశిష్ అగర్వాల్ తన కమీషన్ మినహాయించుకుని మిగిలిన నగదును హవాలా మార్గంలో పొమిల్ జైన్, విపిన్ జైన్‌కు అందజేసేవాడని సిట్ గుర్తించింది. తాము ఎప్పుడూ భోలేబాబా డెయిరీ గురించి వినలేదని, ఏనాడూ ట్యాంకర్‌లో నెయ్యి నింపిందీ లేదని ఆశిష్ అగర్వాల్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సిట్ విచారణలో చెప్పినట్టు తెలిసింది.