Share News

railway station robbery: సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ రైల్లో దోపిడీ

ABN , Publish Date - Jun 27 , 2025 | 02:52 AM

సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి రైల్లోకి చొరబడిన దొంగల ముఠా నలుగురు మహిళల మెడలో ఉన్న 50 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలను దోచుకొని పరారైంది

railway station robbery: సిగ్నల్‌ ట్యాంపరింగ్‌  రైల్లో దోపిడీ

  • చిత్తూరు జిల్లా సిద్ధంపల్లెలో ఘటన

చిత్తూరు రూరల్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి రైల్లోకి చొరబడిన దొంగల ముఠా నలుగురు మహిళల మెడలో ఉన్న 50 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలను దోచుకొని పరారైంది. చిత్తూరు జిల్లా సిద్ధంపల్లె రైల్వేస్టేషన్‌ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిందీ దోపిడీ. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైసూరు నుంచి తిరుపతికి వస్తున్న చామరాజునగర్‌ ఎక్స్‌ప్రెస్‌(16219) గురువారం తెల్లవారుజామున 2.20 గంటలకు చిత్తూరు- కాట్పాడి మధ్య సిద్ధంపల్లె రైల్వేస్టేషన్‌కు కిలోమీటరు దూరంలో ఉండగా రెడ్‌ సిగ్నల్‌ పడడంతో లోకో పైలట్‌ రైలును ఆపేశారు.


అప్పటికే అక్కడ మాటువేసిన దొంగల ముఠా ఒక రైలుపెట్టెలోకి చొరబడి, లైట్లు ఆపేసి, మహిళల మెడల్లోని బంగారు గొలుసులు దోచేసింది. మహిళలు కేకలు వేయడంతో లైట్లు వేసి చూడగా.. అప్పటికే దొంగలు పరారయ్యారు. రైలు తిరుపతికి చేరుకున్నాక బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం సిగ్నల్‌ వైర్‌ కట్‌చేయడం ద్వారా రెడ్‌ సిగ్నల్‌ పడేలా చేసి, సిద్ధంపల్లె రైల్వేస్టేషన్‌కు కిలోమీటరు ముందుగానే రైలు ఆగేలా చేశారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఇలా జరిగిన మూడో ఘటన ఇది. గత రెండు దోపిడీలు ముంగిలిపట్టు వద్ద జరిగాయి.

Updated Date - Jun 27 , 2025 | 02:52 AM