Share News

Kalyani: షైనింగ్‌ టీచర్‌

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:50 AM

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే పవిత్ర బాధ్యత టీచర్లపైనే ఉందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. మొదటి ఏడాదిలో సంస్కరణలు పూర్తిచేశామని, అభ్యసన ఫలితాలు సాధించడమే ఇక ఏకైక లక్ష్యమన్నారు.

Kalyani: షైనింగ్‌ టీచర్‌

  • కర్నూలు జిల్లా ఉపాధ్యాయురాలు కల్యాణికి అరుదైన గౌరవం

  • ఆమె కృషిని ప్రశంసించిన మంత్రి లోకేశ్‌

  • నివాసానికి ఆహ్వానించి సన్మానం

  • ప్రభుత్వ విద్య బలోపేతం బాధ్యత టీచర్లదేనని వ్యాఖ్య

అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే పవిత్ర బాధ్యత టీచర్లపైనే ఉందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. మొదటి ఏడాదిలో సంస్కరణలు పూర్తిచేశామని, అభ్యసన ఫలితాలు సాధించడమే ఇక ఏకైక లక్ష్యమన్నారు. ప్రాథమిక విద్యలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జేఎం తండాలోని ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం.కల్యాణిని బుధవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన సన్మానించారు. వృత్తిపట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఆమెను మంత్రి స్వయంగా తన నివాసానికి ఆహ్వానించారు. పట్టుదలతో పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ‘షైనింగ్‌ టీచర్‌’ పేరుతో అభినందించారు. ఆమె నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 9,600 ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్‌ను కేటాయించామని చెప్పారు. విద్యార్థులకు హోంవర్క్‌ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన టీచర్లున్నారని, ప్రైవేటు కంటే నాణ్యమైన విద్య లభిస్తోందని, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగేలా ప్రభు త్వం చర్యలు తీసుకుంటోందని, వాటి బలోపేతానికి సీరియ్‌సగా పనిచేస్తోందని చెప్పారు.


నాలుగు రెట్లు పెరిగిన విద్యార్థుల సంఖ్య

జేఎం తండాలోని ఏకోపాధ్యాయ పాఠశాలకు 2017లో కల్యాణి బదిలీపై వెళ్లారు. ఆ సమయంలో 1 నుంచి 5 తరగతుల వరకు 14 మంది విద్యార్థులు మాత్రమే ఆ పాఠశాలలో ఉన్నారు. వారిలోనూ రోజూ బడికి వచ్చేది ఇద్దరే. ఒక దశలో బడిని మూసేయాలని భావించారు. అయితే, కల్యాణి సొంత డబ్బుతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందించి, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టారు. ఇంటింటికీ తిరిగి ఆ పాఠశాలపై నమ్మకం కలిగించారు. ఫలితంగా 2020-21 నాటికి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 53కి పెరిగింది. పొరుగు గ్రామాల నుంచి కూడా విద్యార్థులు రావడం ప్రారంభమైంది. అక్కడ చదివినవారిలో 23 మంది గురుకులాల్లో, ఒకరు నవోదయ పాఠశాలలో అడ్మిషన్‌ పొందారు.


ఆశయంతోనే పనిచేశా: కల్యాణి

విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఆశయంతో పనిచేశానని ఈ సందర్భంగా కల్యాణి చెప్పారు. హోంవర్క్‌, హాజరు, క్రమశిక్షణ, ప్రేయర్‌, చేతి రాత, వ్యక్తిగత శుభ్రత, యూనిఫాంలో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు స్టార్‌ ఆఫ్‌ ది వీక్‌ పేరుతో ప్రతి సోమవారం బహుమతులు అందజేస్తున్నానన్నారు. పేద విద్యార్థులకు చదువు దూరం కాకుండా ‘మా తొలి అడుగు’ పేరుతో పలక, బలపం, పెన్ను, నోట్‌ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. తన కృషిని గుర్తించి అభినందించిన మంత్రి లోకేశ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 03 , 2025 | 05:54 AM